
ఖమ్మంలో కవిత అరెస్ట్.. మళ్ళీ వేడెక్కిన వెలుగుమట్ల భూదాన్ వివాదం
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం ఉద్రిక్తంగా మారింది. బాధితులకు మద్దతుగా నిరాహార దీక్ష చేసిన కవితను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం కొత్త మలుపు తిరిగింది. బాధితులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనతో ఖమ్మంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
భూదాన్ భూముల తొలగింపుతో వివాదం
కొన్ని రోజుల క్రితం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. అవి ప్రభుత్వ భూములని పేర్కొంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి గుడిసెలను తొలగించారు. దీంతో బాధితులకు న్యాయం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు.
సోమవారం ఖమ్మానికి వచ్చిన కవిత బాధితులను పరామర్శించారు. వారికి భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలోని జడ్పీ కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఆమె రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని కవితను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లో ఉంచిన అధికారులు రాత్రికి విడుదల చేశారు.
అంబేడ్కర్ భవన్‌లో నిరాహార దీక్ష
పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన కవిత నేరుగా ఖమ్మంలోని అంబేడ్కర్ భవన్‌కు వెళ్లారు. అక్కడ వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదలపై కఠినంగా వ్యవహరించిందని ఆమె విమర్శించారు. బాధితులకు స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని తెలిపారు.
అర్థరాత్రి హైడ్రామా.. పోలీసుల చర్య
దీక్ష శిబిరానికి వందల సంఖ్యలో బాధితులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. అర్థరాత్రి సమయంలో దీక్షను భగ్నం చేసి కవితను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, బాధితుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ గందరగోళంలో విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయింది.
అనంతరం పోలీసులు కవితతో పాటు ఆమె అనుచరులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం సమయంలో కవిత, విశారదన్ మహారాజ్ సహా పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. కవితతో పాటు ఆమె మద్దతుదారులు మరో 33 మందిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఖమ్మం ఏసీపీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ హామీ.. పరిష్కారం కోసం ఎదురుచూపులు
ఇక వెలుగుమట్ల భూదాన్ భూముల సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. భూములు తమకు కేటాయించబడినా పట్టాలు ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల హామీ ఇచ్చారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కవితను హైదరాబాద్‌కు తరలించిన తర్వాత కూడా ఆమె పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

