‘తెలంగాణలో చీటింగ్, లూటింగే’.. కేరళ ఓటర్లకు కవిత పిలుపు..
x

‘తెలంగాణలో చీటింగ్, లూటింగే’.. కేరళ ఓటర్లకు కవిత పిలుపు..

తెలంగాణలో కాంగ్రెస్ పాలన అవినీతి, మోసాలతో నిండి ఉందని వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు కవిత.


కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర యువతకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కీలక పిలుపునిచ్చారు. తెలంగాణలో అభివృద్ధి జరిగిందంటూ రేవంత్ అక్కడ చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. తెలంగాణలో చీటింగ్, లూటింగ్ తప్ప ఏమీ లేదని అన్నారు. కాబట్టి కేరళ ఓటర్లు అంతా కూడా లెఫ్ట్ పార్టీకే ఓటు వేయాలని, మరోసారి విజయన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కవిత.. తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అసలు కవిత.. పినరయి విజయన్‌కు మద్దతుగా ఎందుకు వీడియో రిలీజ్ చేశారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అయితే కేరళ లెఫ్ట్ పార్టీ వాళ్లే కవితను సంప్రదించారని, వాళ్ల అభ్యర్థన మేరకే కవిత ఈ వీడియోను విడుదల చేశారన్న వాదన వినిపిస్తోంది. అసలికే.. సొంత పార్టీ పెట్టి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న కవిత.. ఢిల్లీలో తనకు మద్దతు ఉండాలి కాబట్టి.. కేరళ లెఫ్ట్ పార్టీకి ఇప్పుడు మద్దతు ఇస్తున్నారన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. భవిష్యత్తులో పినరయి విజయన్ మద్దతులో ఢిల్లీలో తన పార్టీని బలోపేతం చేసే ప్రణాళికల్లో ఇది కూడా ఒకటయి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదని కవితన తన వీడియోలో ఆరోపించారు. ఆరు హామీలలో చాలా వరకు అమలు కాలేదని, ఉచిత బస్ సేవ మాత్రమే కొంతవరకు అమలైందని పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగాలు, రైతులకు బోనస్ వంటి హామీలు నెరవేరలేదని, పైగా వాటి ఊసు కూడా ఎవరూ ఎత్తడం లేదని ఆమె విమర్శించారు. వృద్ధాప్య పెన్షన్లు, బీసీ రిజర్వేషన్లు కూడా అటకెక్కేశాయని చురకలంటించారు

తెలంగాణలో కాంగ్రెస్ పాలన అవినీతి, మోసాలతో నిండి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పార్టీకి ఆర్థిక వనరుగా ఉపయోగిస్తున్నారని, ఢిల్లీకి మూటలు మోయడంలో తెలంగాణ నేతలు బిజీగా ఉన్నారని ఆరోపించారు కవిత. వీళ్లు వచ్చి.. అక్కడ ఎనలేని అభివృద్ధి చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారని, కాబట్టి కేరళ ప్రజలు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు కవిత. పినరయి విజయన్ నాయకత్వంలోని లెఫ్ట్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

రేవంత్ రెడ్డి ప్రచార హామీలు నమ్మకూడదని అన్నారు. పినరయి విజయన్ పాలనలో కేరళ అభివృద్ధిని చూసిందని, రేవంత్ హామీలు నమ్మి హస్తాన్ని గెలిపిస్తే అధఃపాతాళానికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారని కవిత వ్యాఖ్యానించారు.

Read More
Next Story