వాస్తవాలు తెలుసుకో బ్రదర్, కేటీఆర్‌కు కవిత చురకలు
x

వాస్తవాలు తెలుసుకో బ్రదర్, కేటీఆర్‌కు కవిత చురకలు

లిక్కర్ కేసు కొట్టివేతపై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి తనే కారణమని రుద్దవద్దని, త్వరలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.


లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్ వచ్చింది. ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే కవితకు బీఆర్ఎస్‌కు మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. కోర్టు నిర్ణయం అనంతరం కవిత.. తాను గతంలో చెప్పినట్లే ఈ కేసులో రాజకీయ కక్షసాధింపుగా తేలిందని అన్నారు. ఇదే అంశంపై స్పందించిన కేటీఆర్.. లిక్కర్ స్కామ్ కేసులో కవితగారికి న్యాయం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఆ తప్పుడు కేసు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికిపై ఈ కేసు ఏమాత్రం కారణం కాదంటూ కవిత మరోసారి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు అటు కుటుంబంలో, ఇటు రాజకీయాల్లో చిచ్చు రేపాయి.

బీఆర్ఎస్ పార్టీ ఓటమిని తనపై రుద్దాలని చూడటం సరికాదని కవిత హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలైన ఇళ్లు, ఉపాధి కల్పించకపోవడం.. దోపిడీదారులకు టిక్కెట్లు ఇవ్వడమే పార్టీ ఓటమికి అసలు కారణాలని ఆమె నిలదీశారు. వాస్తవాలను ఒప్పుకోవాలని, ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారన్న వాస్తవాలను బ్రదర్ తెలుసుకోవాలంటూ కేటీఆర్‌కు చురకలంటించారు.

ఈ సందర్భంగానే తాను జైలులో ఉన్నప్పుడు, తన వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం ఎందుకు మాట్లాడలేదని కవిత ప్రశ్నించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక ఢిల్లీలో ఎన్నికలు వచ్చాయని, కానీ ఇక్కడ పార్టీ ఓడిపోయాకే తనను అరెస్ట్ చేశారన్న సంగతి గుర్తుంచుకోవాలని గుర్తు చేశారు. తప్పు చేయకపోయినా ఏడాది కాలంగా తాను అనుభవించిన మానసిక క్షోభకు ఎవరు సమాధానం చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కవిత సంచలన ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని ఆమె విమర్శించారు. తనపై ‘లిక్కర్ క్వీన్’ అంటూ ప్రత్యర్థులు చేసిన అవమానాలను భరించానని, చివరకు కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కేసు ద్వారా బీజేపీ తన పరువు పోగొట్టుకుందని, తమకు అనుకూలంగా లేని పార్టీలపై కక్ష తీర్చుకోవడానికే సీబీఐ, ఈడీ వంటి సంస్థలను వాడుకుంటున్నారని మరోసారి నిరూపితమైందని కవిత ధ్వజమెత్తారు. గతేడాది పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Read More
Next Story