మహిళా రిజర్వేషన్లపై కవిత సంచలనం
x

మహిళా రిజర్వేషన్లపై కవిత సంచలనం

డిలిమిటేషన్, జనగణన, డ్రాఫ్ట్ బిల్లుపై విమర్శలు, పారదర్శకత కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచిన జాగృతి.


మహిళలకు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదన ద్వారా ఓబీసీ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనిని వెంటనే మార్చేలా కేంద్ర చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేస్తే మహిళలు మళ్ళీ అన్యాయానికి గురవుతారని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలకు సంపూర్ణ న్యాయం అనేది 2027 జనాభా గణనలో ఓబీసీలను లెక్కించాలని, మహిళా కోటాలో ఓబీసీలకు సబ్ కోటా కల్పిస్తేనే జరుగుతుందని కవిత పేర్కొన్నారు.

మహిళా బిల్లులో వెంటనే ప్రయోజనం కలగడం లేదని, దీనిపై ముందే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. బిల్లును డిలిమిటేషన్, జనగణనతో ముడిపెట్టడం వల్ల మహిళలకు లాభం ఆలస్యమవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీసీ మహిళలకు సబ్ కోటా లేకుండా బిల్లు ఆమోదించడం సరైన విధానం కాదని సూచించారు. మహిళా బిల్లుకు తెలంగాణ జాగృతి పోరాటం కీలకమైందని ఆమె వివరించారు.

ఢిల్లీలో నిర్వహించిన దీక్షకు జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలతో సమన్వయం చేసి, దాదాపు 18 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టినట్లు చెప్పారు. పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చ జరిగేలా ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా రాజకీయ ఒత్తిడి సృష్టించడం వల్లే మహిళా బిల్లు ముందుకు వచ్చిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డిలిమిటేషన్‌కు అనుసంధానం చేయడం వల్ల గత ఎన్నికల్లో మహిళలకు ప్రయోజనం అందలేదని ఆమె పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలతో పాటు తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు అమలుకాలేదని వివరించారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం మహిళలకు నష్టం కలిగించే అవకాశముందని ఆమె భావించారు. 2027 జనగణన తర్వాత బీసీల గణన పూర్తి చేసి, దానికి అనుగుణంగా మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. డ్రాఫ్ట్ బిల్లుపై పారదర్శకత లేదని కూడా ఆమె ప్రశ్నించారు.

ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి కూడా బిల్లును చూపించలేదని పేర్కొన్నారు. చర్చకు ముందు అన్ని పార్టీలకు డ్రాఫ్ట్ కాపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్లు ప్రవేశపెట్టే రోజే ఉదయం ప్రతులు ఇవ్వడం వల్ల అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదని తెలిపారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా స్పందించాలని ఆమె కోరారు. గతంలో మద్దతు ఇచ్చిన పార్టీలతో మళ్లీ చర్చలు జరపాలని భావిస్తున్నట్లు చెప్పారు. మహిళలు సాధించుకున్న హక్కులు పూర్తిగా అమలులోకి రావాలంటే మరింత పోరాటం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

Read More
Next Story