
తెలంగాణ రాజకీయాల్లోకి పీకే ఎంట్రీ
రాజకీయవ్యూహకర్త పీకేతో కవిత భేటీ అవటం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది
గతంలో బీఆర్ఎస్ అధినేత దూరంగా పెట్టిన ప్రశాంత్ కిషోర్ తో తాజాగా ఆయన బిడ్డ కల్వకుంట్ల కవిత భేటీ అవటం సంచలనంగా మారింది. మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా (Kavitha)కవితతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Political Strategist Prashant Kishore) సుదీర్ఘంగా భేటీ అయినట్లు జాగృతి(Telangana Jagruthi) వర్గాలు చెప్పాయి. 2023 ఎన్నికలకు ముందు ఇదే పీకేతో చాలాసార్లు (KCR)కేసీఆర్, కేటీఆర్(KTR) భేటీలు జరిపిన విషయం తెలిసిందే.
అప్పట్లో ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే పీకేతో కేసీఆర్, కేటీఆర్ వరుసగా భేటీ అయ్యారు. అయితే వారిమధ్య ఏమి చర్చలు జరిగాయో తెలీదు కాని బీఆర్ఎస్ కోసం పీకే పనిచేయలేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో పీకే ఊసును అందరు మరచిపోయారు.
అలాంటిది ఇపుడు సడెన్ గా పీకే పేరు రాజకీయాల్లో మళ్ళీ వినబడుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పీకే రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈసారి ఎంట్రీకి కారణం ఏమిటంటే కల్వకుంట్ల కవిత. ఈమధ్యనే జరిగిన బీహార్ అసెంబ్లీలో బోల్తాపడిన పీకే పార్టీ జన్ సురాజ్ మళ్ళీ వ్యూహాలను అందించటం ద్వారా అస్తిత్వం చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుంది.
ఇదే సమయంలో రాబోయే ఎన్నికల నాటికి తన సత్తాను చాటాలని బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసిన కవిత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జనాలను కలవటం కోసం జనంబాట పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. జాగృతి పేరుతోనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేసి వచ్చేఎన్నికల్లో తనదెబ్బ ఎలాగుంటుందో మిగిలిన పార్టీలకు రుచిచూపించాలని కవిత డిసైడ్ అయ్యారు.
ఈనేపధ్యంలోనే రాజకీయవ్యూహకర్త పీకేతో కవిత భేటీ అవటం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సంక్రాంతి సందర్భంగా కవితతో పీకే భేటీ అవ్వకముందే ఇద్దరిమధ్యా రెండుసార్లు సమావేశమైనట్లు జాగృతి వర్గాల సమాచారం. అంటే పీకేతో టైఅప్ చేసుకోవటం ద్వారా సర్వేలు చేయించుకుని పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు తీసుకోవాలని కవిత నిర్ణయించుకున్నట్లు అనుమానంగా ఉంది.
అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యంతోనే ఏ పార్టీ అయినా పీకేతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారని అందరికీ తెలిసిందే. తాను అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని పీకేకి బాగా తెలిసొచ్చినట్లుంది. అందుకనే పాత పద్దతిలో మళ్ళీ రాజకీయ వ్యూహాలు, సర్వేలు, సలహాలు, సూచనలంటు రంగంలోకి దిగినట్లున్నారు.
గతంలో తన తండ్రి కేసీఆర్ వద్దని పంపేసిన పీకేతోనే ఇపుడు కవిత ఎందుకు భేటీలు జరుపుతున్నారు ? ఏరకమైన కాంట్రాక్టు చేసుకుంటారనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. కవిత పార్టీ తరపున పీకే బృందం క్షేత్రస్ధాయిలో తొందరలోనే పనులు మొదలుపెడతారనే ప్రచారం బాగా జరుగుతోంది. పీకేతో కవిత ఎంతవరకు లాభపడతారో చూడాల్సిందే.

