
సిట్ విచారణపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు: కవిత
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని కవిత అన్నారు. మునిసిపల్ ఎన్నికలు, బడ్జెట్ అంశాలపై కూడా స్పందించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను తప్పుపడుతూ కేటీఆర్ మాట్లాడటం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. చట్టాలను అందరూ గౌరవించాలని, విచారణకు సహకరించాలని ఆమె సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండేళ్లు గడిచినా సిట్ విచారణ ఇంకా ముగింపుకు రాలేదని తెలిపారు. విచారణ త్వరగా పూర్తై దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు.
సిట్ అధికారులు విచారణకు పిలిస్తే తాను తప్పకుండా హాజరై సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. తనతో పాటు తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ వివరించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్‌ను కూడా సిట్ విచారణకు పిలిచిందని ప్రస్తావించారు. ఈ కేసులో ఎవరైనా పిలిస్తే వెళ్లక తప్పదని ఆమె తెలిపారు.
మునిసిపల్ ఎన్నికల అంశంపై కూడా కవిత స్పందించారు. బీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేసినా కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారని ఆమె ప్రస్తావించారు. చెడ్డవాళ్లకు ఓటు వేయాలని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. కులం కాదు, గుణం చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పైసలు కాదు, పని చేసే అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారికి మద్దతివ్వాలని కోరారు. తెలంగాణ జాగృతి తరఫున ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై మంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు.
రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు కుమ్మక్కయ్యారని కవిత విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో న్యాయంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు. హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. గంజాయి ముఠాల దాడుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ ఫీజు సొంతంగా చెల్లించారా, ప్రభుత్వ సొమ్ముతో కట్టారా అనే అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. దావోస్ పర్యటనలో సీఎం ఎన్ని ఎంఓయూలు చేసుకున్నారని ప్రశ్నించారు. ఫేక్ కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. ఫేక్ ఎంఓయూలపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. ఈ అంశంపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలిపారు.

