
జీవో 317పై కవిత లేఖ.. వన్ టైం రిలీఫ్ డిమాండ్
ఉద్యోగుల బదిలీలు, స్థానికత వివాదాలపై ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది.
జీవో నం.317 వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. బాధితులకు తక్షణ ఉపశమనం కల్పించాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను స్వస్థలాలకు బదిలీ చేసేలా వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన లేఖలో 2021 డిసెంబర్ 6న జీవో 317 జారీ తర్వాత ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కవిత పేర్కొన్నారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ జీవోను రద్దు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీవో 317ను సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కవిత తెలిపారు. ఈ హామీ మేనిఫెస్టోలో కూడా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో పలువురు నాయకులు కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పినట్టు ఆమె సూచించారు.
ఎన్నికల హామీలను అమలు చేయాలని కవిత కోరారు. బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వన్ టైం రిలీఫ్ కింద స్థానికత ఆధారంగా స్వస్థలాలకు బదిలీలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానికత నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించారు.
అసలు జీవో 317 ఎందుకు?
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ అమలు కోసం ఈ జీవో తీసుకువచ్చారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వడం, పరిపాలన సులభతరం చేయడం ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు. కానీ అమలులో సమస్యలు తలెత్తాయి. స్థానికత నిర్ణయంలో స్పష్టత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పుట్టిన చోటు, చదివిన చోటు, సేవ చేసిన ప్రాంతాల మధ్య గందరగోళం ఏర్పడింది. దూర ప్రాంతాలకు బదిలీలు జరగడంతో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీనియారిటీ, ఎంపిక ప్రక్రియలో లోపాలు ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున బదిలీ కావడంతో విద్యా వ్యవస్థపై ప్రభావం పడిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ధర్నాలు నిర్వహించారు. కొందరు కోర్టులను ఆశ్రయించారు. దీంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జీవో 317పై తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. వన్ టైం రిలీఫ్, సవరణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నదే ఉద్యోగుల్లో ఆసక్తి పెంచుతోంది.

