
రేవంత్ అండ చూసుకునే ప్రైవేట్ రంగం రెచ్చిపోతోంది: కవిత
ఫీజుల పెంపు, టీచర్ల పరిస్థితి, ఫుడ్ నాణ్యత, బకాయిలపై కవిత తీవ్ర విమర్శలు చేస్తూ ప్రభుత్వ జోక్యం కోరారు.
తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్న కార్పొరేట్ దోపిడీ వెనక సీఎం రేవంత్ మద్దతు ఉందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహం ఉండటంతోనే ప్రైవేట్ రంగం రెచ్చిపోతోందని, ఆకాశమే హద్దుగా దోపిడీకి తెరలేపుతోందని విమర్శించారు. ప్రైవేట్ రంగాన్ని నియంత్రించాల్సిన సీఎం, కార్పొరేట్ ఆస్పత్రుల ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. ఇది ప్రైవేట్ దోపిడీకి సంకేతమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగానే విద్యా కమిషన్ రిపోర్ట్‌లో లోపాలున్నప్పటికీ, ప్రైవేట్ స్కూల్స్ ఫీజులను ఏడాదికి 7 నుంచి 8 శాతం పెంచే అంశాన్ని అయినా ప్రభుత్వం ఖచ్చితత్వంతో అమలు చేయాలని కవిత కోరారు. 8 శాతం కంటే ఎక్కువ ఫీజు పెంచితే వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫీజులు పెరుగుతున్నా తల్లిదండ్రుల జీతాలు పెరగడం లేదని, టీచర్లకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని కవిత పేర్కొన్నారు.
శ్రీచైతన్య, నారాయణ వంటి సంస్థల్లో టీచర్లకు పీఎఫ్ కూడా అందడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ టీచర్ల జీవితం కష్టాల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్స్‌లో ఆహార నాణ్యతపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఒకే చోట ఆహారం తయారు చేయడం ప్రమాదకరమని తెలిపారు. ఫుడ్ శాంపిళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కోరారు. ఫీజులు ఎక్కువగా ఉండి, చదువు తక్కువగా ఉన్న పరిస్థితి ఉందని విమర్శించారు.
కొద్దిమంది మాత్రమే ర్యాంకులు సాధిస్తారని, వాటిని ప్రచారం చేసి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.42 వేల సాయం ఇవ్వకపోవడంతో రూ.212 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. బీసీ పేద విద్యార్థులకు కూడా ఇదే సాయం అందించాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భారీ బకాయిలు ఉన్నాయని, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినవి కూడా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఇది హైకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వని స్కూల్స్‌కు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల సంస్థలు స్కూల్స్ ప్రారంభించి స్థానికులకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే మంచి సేవలు అందిస్తున్నాయని, అన్ని స్కూల్స్‌ను ఒకేలా చూడకూడదని స్పష్టం చేశారు.
అయితే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పుస్తకాలు, ఫుడ్, ఇతర సేవల పేరుతో అధిక వసూళ్లు జరుగుతున్నాయని, ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యాశాఖపై కూడా స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను సీరియస్‌గా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. గురుకులాల్లో ఘటనలు జరిగినా సమీక్షలు జరగడం లేదని తెలిపారు.

