
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్‌కు కేసీఆర్ లేఖ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులకు స్పందించిన కేసీఆర్, మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణకు హాజరుకాలేనని తెలిపారు. విచారణ వాయిదా వేయాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. శుక్రవారం జరగాల్సిన విచారణకు హాజరుకాలేనని తెలియజేస్తూ ఆయన సిట్ అధికారులకు లేఖ పంపారు.
ఈ కేసు నేపథ్యంలో గురువారం సిట్ అధికారులు కేసీఆర్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేశారు. తొలుత ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి నోటీసులు అందజేస్తారనే ప్రచారం జరిగినా, చివరకు నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పీఏకు నోటీసులు అందించారు. నోటీసుల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
నోటీసులకు ఇచ్చిన సమాధానంలో కేసీఆర్, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున పార్టీ పనులతో బిజీగా ఉన్నానని వివరించారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారమే చివరి తేదీ కావడంతో విచారణకు రావడం సాధ్యం కాదని తెలిపారు. అందువల్ల విచారణను వాయిదా వేయాలని, మరో తేదీ తెలియజేయాలని సిట్‌ను కోరారు.
అదే సమయంలో, మాజీ సీఎం, ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తి సహకారం అందిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కు రావడం కంటే, తన నివాసమైన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ నిర్వహిస్తే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 160 ప్రకారం విచారణ ఒకే ప్రాంతంలోనే జరగాలన్న నిబంధన లేదని కూడా ఆయన గుర్తు చేశారు. ఇకపై తనకు వచ్చే నోటీసులన్నింటిని ఎర్రవల్లికే పంపాలని అభ్యర్థించారు.
ఈ పరిణామాల మధ్య, కేసీఆర్ ఇచ్చిన ప్రత్యుత్తరంపై సిట్ అధికారులు ఎలా స్పందిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల కారణాన్ని పరిగణనలోకి తీసుకుంటారా, లేక ప్రత్యామ్నాయంగా విచారణ చేపడతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.

