
ఫామ్ హౌస్ కదలని కేసీఆర్
అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR)కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao) మాత్రమే
ఏపార్టీకి అయినా అధినేతే సగంబలం. కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీజేపీకి కేంద్రమంత్రులు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డితో పాటు పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు పార్టీ అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ తరపున ఎవరు ప్రచారం చేస్తున్నారు ? పార్టీ అధినేత (KCR)కేసీఆర్ ఇప్పటివరకు ఫామ్ హౌస్ వదిలి బయటకు రాలేదు. అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR)కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao) మాత్రమే. నిజానికి పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తే వచ్చే ఊపు కేటీఆర్, హరీష్ చేస్తే రాదుగాక రాదు. ఈ విషయం ఇప్పటికే చాలాసందర్భాల్లో నిరూపితమైంది.
కేటీఆర్, హరీష్ పొద్దున లేచింది మొదలు ప్రతిరోజు రేవంత్ ను టార్గెట్ చేస్తు ఆరోపణలు చేస్తునే ఉన్నారు. దీనివల్ల ఎన్నికల ప్రచారంలో వీళ్ళు కొత్తగా జనాలకు చెప్పేది ఏమీ ఉండదు. రేవంత్ ను వ్యక్తిగతంగాను, ప్రభుత్వంపైన చేస్తున్న ఆరోపణలే ఎన్నికల ప్రచారంలో కూడా చేస్తే జనాలను ఎందుకు ఆకట్టుకుంటుంది ? తమ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో జనాలకు చేసింది చెప్పుకోవటం కన్నా రేవంత్ ను టార్గెట్ చేయటంపైనే కేటీఆర్, హరీష్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దాంతో వీళ్ళ ప్రసంగాలు జనాలను పెద్దగా ఆకట్టుకోవటంలేదు. నిజానికి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, అర్హులైన పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రు. 25 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచటం లాంటి పథకాలను అమలుచేస్తోంది.
అలాగే సన్నబియ్యం కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తోంది. ఇవి కాకుండా స్వయం సహాయక బృందాల ద్వారా మహాలక్ష్మి పథకంలో మహిళలకు రుణాలిప్పించటం, వ్యాపారాలు పెట్టించటం లాంటి కార్యక్రమాలను చేస్తోంది. తన ప్రచారంలో రేవంత్ పైన చెప్పుకున్న పథకాలు, కార్యక్రమాలను ప్రస్తావిస్తునే కేసీఆర్ పాలనలోని లోపాలను, అవినీతిని జనాలకు చెబుతున్నారు. కేసీఆర్ పై రేవంత్ చేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి, కేటీఆర్ ఎదుర్కొంటున్న ఫార్ములా కార్ రేసు కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ, హరీష్ పైన కాళేశ్వరం అవినీతి ఆరోపణల్లాంటి అనేక అంశాలను రేవంత్ టచ్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ ముఖ్యులపైన రేవంత్ చేస్తున్న ఆరోపణలను కొట్టేసేందుకు లేదు.
ఎందుకంటే ఇవే ఆరోపణలు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని కవిత ప్రతిరోజు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ అవినీతికి పాల్పడినట్లు కవిత అంటున్నారు. కేసీఆర్ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ అరాచకం జరిగింది నిజమే అని చెబుతున్నారు. తనతో పాటు తన భర్త కూడా బాధితులమే అని అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అవినీతి జరిగింది అనేందుకు ఇప్పటికే ఏసీబీ, ఈడీలకు కావాల్సనన్ని సాక్ష్యాలు దొరికాయి.
ఇదే సమయంలో రేవంత్ మీద చేస్తున్న ఆరోపణలకు కేటీఆర్, హరీష్ ఎలాంటి ఆధారాలను చూపలేక కేవలం ఊకదంపుడు ఆరోపణలను మాత్రమే పదేపదే చేస్తున్నారు. ఈ కారణాలతో రేవంత్ ప్రచారంతో పోల్చి చూస్తే కేటీఆర్, హరీష్ ప్రచారం తేలిపోతోంది. పోటీచేస్తున్న అభ్యర్ధులందరు కేసీఆర్ ప్రచారం చేయాలని కోరుకుంటారే కాని కేటీఆర్, హరీష్ ప్రచారం చేస్తే చాలని సరిపెట్టుకోరు. అనారోగ్యాలు తదితర కారణాల వల్ల కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రాలేకపోతున్నారు. అందుకనే కేటీఆర్, హరీష్ ప్రచారం జనాలను పెద్దగా ఆకట్టుకోవటంలేదు. ప్రచారానికి ఉన్నది 24 గంటలు మాత్రమే. రేపు అంటే 9వ తేదీ సాయంత్రానికి బహిరంగ ప్రచారం ముగుస్తుంది. కాబట్టి ఇక కేసీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశాలు కూడా లేవు.

