
ఫామ్ హౌస్ లో కేసీఆర్ అర్జంట్ మీటింగ్
రేపటి సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా ? అన్నది అనుమానంగా ఉంది
టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రావాలని సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసు జారీచేయటం పార్టీలో సంచలనంగా మారింది. ఇంత తొందరగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు కేసీఆర్ ను విచారణకు పిలుస్తు నోటీసు ఇస్తారని పార్టీలోని కీలకనేతలు ఎవరూ ఊహించలేదు. అందుకనే శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణకు హాజరవ్వాలని గురువారం మధ్యాహ్నం సిట్ నుండి నోటీసు రావటం పార్టీలో కలకలం రేపుతోంది. నోటీసు అందింది సరే కేసీఆర్ విచారణకు హాజరవుతారా ? ఇపుడిదే అందరిలోను ఉత్కంఠ రేపుతోంది. రేపటి సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా ? అన్నది కూడా అనుమానంగానే ఉంది.
పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే విచారణకు హాజరయ్యే విషయంపైనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో అర్జంట్ మీటింగ్ పెట్టారు. సిద్ధిపేటలో పర్యటిస్తున్న తన్నీరు హరీష్ రావు, సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్ పర్యటనలను అర్ధాంతరంగా ముగించుకుని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. అలాగే అందుబాటులో ఉన్న సీనియర్ నేతలను కూడా ఫామ్ హౌస్ కు రమ్మని కబురు పంపినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు ఈరోజు నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అందుకని చాలామంది నేతలు ఆ బిజీలో ఉన్నారు.
ఇక అర్జంట్ మీటింగ్ విషయానికి వస్తే అసలు సిట్ విచారణకు హాజరవ్వాలా ? వద్దా అనే విషయంపైనే చర్చ జరగబోతున్నట్లు తెలిసింది. సిట్ నోటీసులో చెప్పినట్లుగా శుక్రవారం విచారణకు హాజరుకావటం కష్టమని మరో తేదీని అడగాలని లేదా మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత విచారణకు హాజరవుతానని రిక్వెస్టు లెటర్ రాయాలనే విషయాలను అధినేత ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈరోజు మీటింగుకు పార్టీ లాయర్లను కూడా రమ్మన్నట్లుగా తెలిసింది. విచారణకు హాజరవ్వాటం లేదా గైర్హాజరవ్వటం అనే విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోబోతున్నారు.
ఆమధ్య కాళేశ్వరం అవినీతి, అవకతవతకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కూడా నోటీసులు అందగానే చెప్పిన తేదీకి కాకుండా కేసీఆర్ మరో తేదీలో విచారణకు హాజరయ్యారు. అప్పుడు కూడా కమిషన్ కు లేఖ రాసి విచారణ తేదీని మార్చాలని కోరినట్లుగానే ఇపుడు కూడా సిట్ కు విచారణ తేదీమార్పు విషయంలో లేఖ రాసే విషయమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు. నోటీసు జారీ, విచారణ అంతా కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపులో భాగమని బీఆర్ఎస్ నేతలంతా ఇప్పటికే ఎదురుదాడులు మొదలుపెట్టేశారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత విచారణకు హాజరవుతానని లేఖ రాయటంపైనే ఎక్కువ దృష్టిపెట్టినట్లు సమాచారం. మరి మీటింగులో ఏమి ఫైనల్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

