కొండా సురేఖనా ? వివాదాల సురేఖనా ?
మంత్రి నేపధ్యాన్ని పరిశీలిస్తే సురేఖకు వివాదాల్లో ఇరుక్కోవటం ఇదే మొదటిసారి కాదని అర్ధమైపోతుంది
కొద్దిరోజులుగా వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయిన దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ. కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడిన ఫలితంగా తల్లి, మంత్రి కొండా సురేఖ ఇపుడు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. వివాదం ఫలితంగా ఏకంగా మంత్రిపదవికి ఉధ్వాసన తప్పదా అనే పరిస్ధితి ఏర్పడింది. మంత్రి నేపధ్యాన్ని పరిశీలిస్తే సురేఖకు వివాదాల్లో ఇరుక్కోవటం ఇదే మొదటిసారి కాదని అర్ధమైపోతుంది.
గతంలో ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు సంబంధించి సినీ నటుడు అక్కినేని నాగార్జున కోడలు సమంత- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లింక్ పెడుతు మంత్రి ఘోరమైన ఆరోపణలు చేశారు. మంత్రి చేసిన ఆరోపణలు అప్పట్లో తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తమ ఫ్యామిలీపైన చేసిన నిరాధార ఆరోపణలపై నాగార్జున పరువు నష్టందావా వేస్తే తర్వాత అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నారు మంత్రి.
అవే వ్యాఖ్యలపై మంత్రిపై కేటీఆర్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పరువునష్టం కేసు ఇంకా విచారణలోనే ఉంది. సహచర మంత్రులు గడ్డం వివేక్, పొంగులేటి శ్రీనివాసులరెడ్డిపైన కూడా నానా యాగీ చేసి ఆరోపణలు చేసిన మంత్రి. తాజాగా రేవంత్ పై కూతురు చేసిన ఆరోపణలు, విమర్శలను వెనకేసుకుని రావటంతో పీక్స్ కు చేరుకున్న మంత్రి వివాదాస్పద వైఖరి.
ఇవన్నీ చూసిన తర్వాత కొండా సురేఖకు వివాదాలు కొత్తకావు, వివాదాలకూ మంత్రి కొత్తకాదు అన్న విషయం అర్ధమవుతోంది. సురేఖ కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్...ఏ పార్టీలో ఉన్నా వివాదాలు సహజమే అన్నట్లుగా పరిస్దితి మారిపోయింది. అందుకనే మంత్రి గురించి పార్టీలో కొందరు ‘వివాదాల సురేఖ’ అని చెప్పుకుంటున్నారు.

