
హంగ్ మున్సిపాలిటీలపై కేటీఆర్ ఫోకస్..
హంగ్ మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ అప్రమత్తం. 8 పట్టణాలకు సీనియర్ నేతలు ఇన్‌ఛార్జిలుగా నియామకం. కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు.
హంగ్ మున్సిపాలిటీల్లో రేపు జరగనున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పట్టణాలకు ప్రత్యేక ఎన్నికల ఇన్‌ఛార్జిలను నియమించారు. కాంగ్రెస్ కుట్రలు, అక్రమాల ఆరోపణల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ అరాచకాలు, బెదిరింపులు, పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలతో ఆయన మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. పార్టీ స్థానిక నాయకత్వానికి పూర్తి అండగా నిలబడతామని తెలిపారు. హంగ్ పరిస్థితి నెలకొన్న 8 పట్టణాల్లో బీఆర్‌ఎస్‌కు స్పష్టంగా ఛైర్మన్ పీఠం గెలిచే అవకాశాలు ఉన్నాయని భావించి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన ప్రాంతాలకు బయలుదేరారు.
మున్సిపాలిటీల ఇన్‌ఛార్జిలు వీరే
తొర్రూర్: ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
జనగామ: బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
క్యాతన్‌పల్లి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
కాగజ్‌నగర్: జోగు రామన్న
జహీరాబాద్: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
కిడ్నాప్‌లతోనే పదవులు
సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరి చేసిందని విమర్శించారు. కిడ్నాప్‌లు, దాడులు, అక్రమ ఓట్లతో పదవులు పొందిందని ఆరోపించారు. ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లు నమోదు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభావంతో పోలీసులు వ్యవహరిస్తున్నారని, డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో కొన్ని చోట్ల ఛైర్‌పర్సన్ ఎన్నికలను వాయిదా వేశారని, సంబంధిత అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా, హంగ్ మున్సిపాలిటీల్లో రాజకీయ కదలికలు వేగంగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రత్యేక పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి ఫలితాలు స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

