సీపీఐతో చేతులు కలపటానికి  అభ్యంతరం లేదన్న కేటీఆర్
x
BRS working President KTR

సీపీఐతో చేతులు కలపటానికి అభ్యంతరం లేదన్న కేటీఆర్

కేటీఆర్ అవకాశవాద ఆఫర్ ను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపితే సీపీఐకి సమస్యలు తప్పవు


రాజకీయాల్లో గెలుపుకు అనేక మార్గాలుంటాయి. రాజమార్గంలో గెలుపునే ప్రజలు ఎక్కువగా హర్షిస్తారు. అలాకాదని అవసరం లేనపుడు మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా, అవసరం వచ్చిందికదాని పదేపదే ప్రత్యర్ధి పేరు ప్రస్తావించటాన్ని పచ్చి ‘అవకాశవాదం’ అనే అంటారు. ఇపుడిదంతా ఎందుకంటే (BRS)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వైఖరి అవకాశవాదంగానే అనిపిస్తోంది. విషయం ఏమిటంటే (Kothagudem) కొత్తగూడెం కార్పొరేషన్ కు ఎన్నిక ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యాయి. ఉన్న 60 డివిజన్లలో కాంగ్రెస్ 22 డివిజన్లలో గెలవగా, సీపీఐ కూడా మరో 22 డివిజన్లలో గెలిచింది. బీఆర్ఎస్ 8 డివిజన్లలో నెగ్గింది. ఈ పార్టీలు కాకుండా బీజేపీ 1, సీపీఎం చెరో డివిజన్లో గెలిచాయి. ఈ పార్టీలు కాకుండా ఇతరులు అంటే స్వతంత్రులు మరో 6 మంది గెలిచారు. ప్రస్తుతం ఇక్కడ ఫలితం హంగ్ అయ్యింది. 16వ తేదీన మేయర్ ఎన్నిక జరగబోతోంది.

కొత్తగూడెంలో మేయర్ పదవి దక్కించుకోవాలంటే 60 డివిజన్లలో సగం+ఒకటి అదనంగా గెలవాలి. అంటే 31 డివిజన్లు గెలిచిన పార్టీకే మేయర్ పదవి దక్కుతుంది. 30+1 మ్యాజిక్ మార్క్ ను మించి కాంగ్రెస్+సీపీఐ ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల నుండి ఈ రెండుపార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులు కుదరక ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో అన్నీ వార్డులకు రెండుపార్టీలు పోటీచేశాయి. ఎన్నికల సమయంలోనే ఫ్రెండ్లీ కంటెస్ట్ అని ప్రకటించాయి కాబట్టి ఇపుడు మేయర్ ఎన్నికలో కూడా ఈ రెండుపార్టీలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫార్వార్డ్ బ్లాక్, ఇతరులు కూడా చేతులు కలిపే అవకాశాలు స్పష్టంగానే కనబడుతున్నాయి.

ఇక్కడే కేటీఆర్ మధ్యలో దూరారు. సీపీఐకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ‘‘సీపీఐతో చేతులు కలపటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మేయర్ పదవి తీసుకుంటామని చెప్పినా తమకు అభ్యంతరం లేదు’’ అని అన్నారు. సీపీఐ, బీఆర్ఎస్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 30 డివిజన్లు అవుతాయి కాబట్టి తమకే మేయర్ పీఠం దక్కుతుందని మీడియా సమావేశంలో ప్రకటించారు. నిజానికి ఈ రెండుపార్టీలు గెలిచినా వచ్చేది 30 డివిజన్లే. అందుకనే సీపీఎం, ఇతరులు కలవకపోతారా అన్నఆలోచనతోనే కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. ‘‘సింగరేణిని దోచుకున్న కాంగ్రెస్ కు మేయర్ కుర్చీ దక్కకూడదనే తాను ఈ ఆఫర్ ఇచ్చాను’’ అని కూడా ప్రకటించారు. కేటీఆర్ ఆఫర్ కు సీపీఐ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.

కేటీఆర్ ఆఫర్ ను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపితే భవిష్యత్తులో సీపీఐకి సమస్యలు తప్పవు. అలాగే రెండుపార్టీల కలయికతో దక్కే మేయర్ కుర్చీ ఎప్పుడు పడిపోతుందో కూడా ఎవరూ చెప్పలేరు.

ఇక్కడే కేటీఆర్ అవకాశవాదం స్పష్టంగా బయటపడింది. ఎలాగంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సీపీఐ, సీపీఎంను అవసరమైనపుడు తప్పితే ఇంకెప్పుడూ దగ్గరకు తీసుకోలేదు. 2018 ఎన్నికల్లో రెండుసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దూరంపెట్టేశారు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వచ్చినపుడు తప్పదు కాబట్టి వామపక్షాలను మాయమాటలు చెప్పి మళ్ళీ దగ్గరకు తీసుకున్నారు. ఉపఎన్నికలో గెలవగానే అవసరం తీరిపోయింది కాబట్టి మళ్ళీ వామపక్షాలను దూరంపెట్టేశారు. ఉపఎన్నిక అయిపోయిన దగ్గరనుండి కేసీఆర్ అపాయిట్మెంట్ కోసం సీపీఐ, సీపీఎం నేతలు ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం ఒక్కసారి కూడా పట్టించుకోలేదు.

కేవలం మునుగోడు ఉపఎన్నికలో గెలవటం కోసమే తమను దగ్గరకు తీసుకుని అవసరం తీరిపోయిన తర్వాత దూరంపెట్టేశారని కేసీఆర్ వైఖరిపై వామపక్షాలు బహిరంగంగానే ధ్వజమెత్తాయి. కేసీఆర్ వైఖరిపైన అప్పటినుండి రెండుపార్టీలు చాలాసార్లు మీడియాలో కూడా రెచ్చిపోయారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుపెట్టుకుని మిత్రపక్షాలయ్యాయి. అప్పటినుండి ఇప్పటివరకు రెండుపార్టీలు కలిసే ఉన్నాయి. కేసీఆర్ లాగ కాకుండా వామపక్షాల నేతలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని రెగ్యులర్ గా కలుస్తునే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీపీఐకి కాంగ్రెస్ ఒక ఎంఎల్సీ కూడా ఇచ్చింది.

కాబట్టి తాము ఎవరితో చేతులు కలిపితే దీర్ఘకాలంలో లాభంగా ఉంటుంది అనే విషయాన్ని సీపీఐ కొత్తగూడెం ఎంఎల్ఏ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు ఎవరూ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అధికారంలో ఉన్నంత కాలం అవసరానికి మాత్రమే వామపక్షాలను వాడుకుని తర్వాత కేసీఆర్ దూరంపెట్టేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడెప్పుడూ వామపక్షాల తరపున కేటీఆర్ తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడిన దాఖలాలు లేవు. కేసీఆర్ కాకపోయినా కనీసం కేటీఆర్ కూడా వామపక్షాలతో మాట్లాడిందిలేదు. అలాంటిది ఇపుడు మళ్ళీ అవసరం వచ్చింది కాబట్టి సీపీఐతో చేతులు కలిపితే కనీసం ఒక్కకార్పొరేషన్లో అయినా అధికారపార్టీ అనిపించుకునే అవకాశం దక్కించుకోవాలని కేటీఆర్ ఆశపడుతున్నట్లుంది. అందుకనే సీపీఐకి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story