
ఫార్ములా రేస్ కేసు: ప్రభుత్వానికి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏమీ లేకపోయినా కావాలనే కాంగ్రెస్ దీనిని పెద్ద అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా మారుస్తూ ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఈ కేసుపై కేటీఆర్ స్పందించడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఇదొక లొట్ట పీసు కేసు అనడానికి ప్రభుత్వం తీరే ఉదాహరణ అని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ల నాలుగు నెలలైంది. ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు, యంత్రాంగం అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నా.. బ్యాంక్ ద్వారా అధికారికంగా నిధులు బదిలీ చేసిన ఫార్ములా-ఈ అంశం మీద మాత్రమే కేసు పెట్టగలిగారు. అందులో నిజంగా అవినీతి కోణం ఉంటే.. దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అని ప్రశ్నించారు కేటీఆర్.
‘‘ఈ ఏసీబీ ఛార్జ్‌షీట్ రేవంత్ ప్రభుత్వం ఎంత నిస్పృహలో ఉందో చూపించడమే కాకుండా, మా హయాంలో జరిగిన మచ్చలేని పాలనకు సర్టిఫికేట్ లాంటిది. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఈ ఛార్జ్‌షీట్ ద్వారా స్పష్టం అవుతోంది. మేము కేవలం అభివృద్దే లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపాం’’ అని తెలిపారు.
‘‘ఫార్ములా-ఈ రేస్ ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ నగరాల సరసన నిలిపేందుకు ఉపయోగించిన ₹49 కోట్ల బ్యాంక్-టు-బ్యాంక్ నిధుల బదిలీని కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ అంటుందా? స్కాంగ్రెస్ నాయకులారా.. రండి చూసుకుందాం!’’ అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని మసకబర్చాలనే ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మరి కేటీఆర్ ఛాలెంజ్‌ను కాంగ్రెస్ స్వీకరిస్తుందా? లేదా? అనేది చూడాలి.

