‘నిలదీస్తే కేసులు.. సిట్ విచారణ కూడా అదే’
x

‘నిలదీస్తే కేసులు.. సిట్ విచారణ కూడా అదే’

హరీష్ రావు విచారణను తీవ్రంగా తప్పుబట్టిన మాజీ మంత్రి కేటీఆర్.


ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ కక్షరాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో హరీష్ రావును విచారించడంపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిట్ విచారణ కాదని, పిచ్చి విచారణ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు నిలదీసినా వారిపై కేసులు పెట్టిస్తూ కక్ష రాజకీయాలకు కాంగ్రెస్ నాంది పలుకుతోందంటూ విమర్శలు గుప్పించారు. న్యాయం కోసం తాము హైకోర్ట్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఎంత దూరమైనా వెళ్తామన్నారు.

‘‘ప్రజలకు మోస పూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. అందుకే నిలదీసిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి సృజన్‌రెడ్డి. కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మల్లించడానికి కాంగ్రెస్ విచారణలను వాడుకుంటుంది’’ అని ఆరోపించారు కేటీఆర్.

పసలేని ఫోన్ టాపింగ్

‘‘ఫోన్ టాపింగ్ అనేది పసలేని కేసు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. అయినా ఇంకా దానిని సాగదీయంలో అర్థమేంటి? ఈ కేసుకు సంబంధించి సిట్ కానీ, సర్కార్ కానీ ఒక్కసారయినా అధికారికంగా మాట్లాడిందా? ఒక్కరిపై అయినా నేరం రుజువైందా? తప్పు జరిగింది అంటున్నప్పుడు దానిని ఎందుకు నిరూపించలేకపోతున్నారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

మూడు గంటలకుపైగా హరీష్ రావు విచారణ

మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు మూడు గంటలకుపైగా విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో పలు అంశాలపై అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఇతర పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా హరీష్ రావును విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

Read More
Next Story