
‘రేవంత్.. లక్కీ డ్రాలో సీఎం అయ్యా’
రాష్ట్రాన్ని నడపడం చేతగాకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అడ్డగోలుగా తిడుతూ రేవంత్ టైంపాస్ చేస్తున్నారంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.
రేవంత్ రెడ్డి సత్తా ఉండి సీఎం కాలేదని, లక్కీ డ్రాలో ఆ పదవి ఆయనకు వచ్చిందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడం తప్ప ప్రజలకు రేవంత్ చేసిందేమీ లేదని విమర్శనాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్.. సోమవారం భూపాలపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగానే ఆయన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ ర్యాలీ సందర్భంగా పోలింగ్ రోజు బూత్‌కు వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం వచ్చాక పరిపాలనపై దృష్టి పెట్టకుండా సీఎం మాటలతోనే సమయం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. పాలన చేయలేక మాజీ సీఎం కేసీఆర్‌ను అడ్డగోలుగా తిడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మె చేసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు పక్కన ఉండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు. ఆ నేపథ్యంతోనే నేటి రాజకీయ వైఖరి ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహిళల నుంచి రైతుల వరకు అందరికీ అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేస్తోందని అన్నారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారులు తప్ప మిగిలినవారంతా కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి మాటలు విని కొందరు పోలీసు అధికారులు ప్రతిపక్షాలు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, కార్యకర్తలను వేధిస్తే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ హామీలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సింగరేణి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల బాట పట్టించారని ఆరోపించారు. రూ.6,000 కోట్ల స్కామ్‌పై ఆధారాలతో బయటపెట్టినా ఇప్పటివరకు చర్యలు లేకపోవడం ఆందోళనకరమని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది.
మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్ర పోటీ పడుతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనుండటంతో.. ఆఖరి రోజున ప్రతి పార్టీ భారీ సంఖ్యలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. బడాబడా నేతలను ఇప్పటికే రంగంలోకి దింపు ప్రచారం చేయిస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది? అనేది కీలకంగా మారింది.

