KTR SIT Enquiry
x
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణకు హాజరవుతున్న కేటీఆర్

కేటీఆర్ విచారణ, 7 గంటల పాటు ప్రశ్నల పరంపర

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ సిట్ విచారణ ఎదుర్కొన్నారు. రాజకీయ, ఆర్థిక, సాంకేతిక కోణాల్లో 11 ప్రశ్నలతో దర్యాప్తు కీలక దశకు చేరింది.


తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సిట్ దాదాపు ఏడు గంటల పాటు విచారించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతనిని ప్రశ్నించింది. జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో జరిగిన విచారణ దాదాపు ఏడు గంటల పాటు సాగింది. ఈ వ్యవధిలో కేటీఆర్‌ను పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. మొత్తం 11 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో పార్టీకి వచ్చిన విరాళాలు, ఎలక్టోరల్ బాండ్స్, సిరిసిల్ల వార్ రూమ్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రధాన అంశాలుగా నిలిచాయి. అయితే ఈ ప్రశ్నలకు కేటీఆర్ ఇచ్చిన సమాధానాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ విచారణతో కేసు కీలక దశకు చేరిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

సిట్ విచారణలో కేటీఆర్‌కు సంధించిన ప్రశ్నలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో పార్టీకి వచ్చిన విరాళాల వివరాలపై అధికారులు ఆరా తీశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఎలక్టోరల్ బాండ్ దాతల సమాచారం మీకు ఎంతవరకు తెలుసు అన్న అంశంపై ప్రశ్నించారు. సంధ్య శ్రీధర్ రావు ద్వారా 12 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయా అన్న విషయాన్ని స్పష్టంగా అడిగినట్లు సమాచారం.

ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్‌కు బీఆర్ఎస్ డబ్బులు చెల్లించిందా..?

అలాగే అప్పటి ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు బృందం ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా అన్న కోణంలో కూడా విచారణ సాగింది. సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏమిటి, అక్కడ జరిగిన కార్యకలాపాలు ఏంటన్న దానిపై సిట్ దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ ఘటనలో సిరిసిల్ల కేంద్రంగా టెక్నీషియన్లు, వ్యాపారవేత్తల పాత్ర ఉందా అనే అంశాన్ని కూడా లోతుగా ప్రశ్నించారు.

ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన సాఫ్ట్‌వేర్ కోసం బీఆర్ఎస్ ఖాతాల నుంచి చెల్లింపులు జరిగాయా అన్న అంశంపై వివరణ కోరారు. మీడియా రంగానికి సంబంధించిన అంశంగా ఛానెల్ ఎండీ శ్రవణ్ రావుతో ఉన్న పరిచయం ఏమిటి, వార్ రూమ్‌లో ఏం జరిగిందన్న ప్రశ్నలు సంధించారు. 2023 ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ అభిప్రాయం ఏమిటన్న దానిపై కూడా విచారణ జరిగింది.

ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులతో ఎన్నికల సమయంలో వాట్సాప్, సిగ్నల్ యాప్స్ ద్వారా తరచూ మాట్లాడిన కారణాలపై స్పష్టత కోరారు. అలాగే సినీ ప్రముఖులు, హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగ్ వెనుక ఎవరి పాత్ర ఉందని భావిస్తున్నారన్న ప్రశ్న కూడా సిట్ అడిగినట్లు సమాచారం.

అసలు వివాదం నేపథ్యం

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వ కాలంలో వెలుగులోకి వచ్చిన తీవ్రమైన ఆరోపణలతో మొదలైంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు, సినీ రంగానికి చెందిన పలువురు ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 2023 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేసులు నమోదయ్యాయి. అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు.

ఇప్పటివరకు జరిగిన విచారణ

ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ పోలీస్ అధికారులు సిట్ విచారణను ఎదుర్కొన్నారు. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావును పలుమార్లు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు ఉపయోగించిన సాంకేతిక వ్యవస్థలు, డేటా నిల్వలు, కమ్యూనికేషన్ యాప్స్ వినియోగంపై సిట్ లోతుగా పరిశీలించింది. తాజాగా కేటీఆర్ విచారణ జరగడంతో ఈ కేసు రాజకీయంగా మరింత ప్రాధాన్యం పొందింది.

కేటీఆర్ విచారణ ముగిసినప్పటికీ కేసు ఇక్కడితో ఆగే సూచనలు కనిపించడం లేదు. వచ్చే దశలో మరిన్ని కీలక నేతలకు నోటీసులు జారీ అయ్యే అవకాశముందని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరింత దుమారం రేపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story