ఫోన్ ట్యాపింగ్ కేసు: ‘కేసీఆర్‌ విషయంలో నిబంధనలు పాటించరా ?’
x

ఫోన్ ట్యాపింగ్ కేసు: ‘కేసీఆర్‌ విషయంలో నిబంధనలు పాటించరా ?’

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో జరగనుంది.


ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 65 ఏళ్ల వయసు దాటిన వారిని నివాసంలోనే విచారించాలన్న రూల్‌ను సిట్ అధికారులు గాలికి వదిలేశారని, అందుకు కేసీఆర్ వ్యవహారంలో వారు అవలంబిస్తున్న వైఖరి స్పష్టం చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరుకవాల్సిందేనంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) రెండో సారి నోటీసులు జారీ చేసింది. అయితే కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

ఈ కేసులో కేసీఆర్ ఇప్పటికే తాను ఉన్న నివాస చిరునామాతో పోలీసులకు సమాధానం ఇచ్చినప్పటికీ, ఆయన లేని ఇంటికి రాత్రిపూట వెళ్లి గేటుకు నోటీసులు అంటించడం సరికాదని కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి చర్యలు అహంకారాన్ని చూపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలన్న నిబంధనను పోలీసులు అతిక్రమిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌పై అవగాహన ఉందా లేక ప్రభుత్వ ఒత్తిడితో ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారా అని ప్రశ్నించారు. చట్టం, న్యాయం, ధర్మంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కేటీఆర్ తెలిపారు. అక్రమ కేసులను ఎదుర్కొంటామని, ప్రతి తప్పును ప్రజల ముందుంచుతామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు జరుగుతున్న విషయాలను గమనిస్తున్నారని కూడా ఆయన అన్నారు.

ఇదే సమయంలో, సిట్ నోటీసులపై కేసీఆర్ ఎర్రవల్లిలో నేతలు, న్యాయవాదులతో సమాలోచనలు చేసినట్లు సమాచారం. కేటీఆర్, హరీశ్ రావు కూడా అక్కడే ఉండి విచారణ అంశంపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ తమ ఇంటికే వచ్చి విచారించాలని చేసిన విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. హైదరాబాద్‌లోనే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని నివాసంలో అందుబాటులో ఉండాలని సిట్ సూచించింది.

Read More
Next Story