‘రేవంత్ సర్కార్‌ను చూసి యువత ఛీ కొడుతుంది’
x

‘రేవంత్ సర్కార్‌ను చూసి యువత ఛీ కొడుతుంది’

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ నిలిచిపోయిందని కేటీఆర్ విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల హామీ అమలు కాకపోవడంపై నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరుగుతోందన్నారు.


రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారం వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పుడు మొఖం చాటేస్తుండటం సిగ్గుమాలిన చర్య అంటూ ఘాటు వ్యాఖ్యలు చేరశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగాల భర్తీ అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉద్యోగాల భర్తీ కానీ ఇప్పుడు ఆ మాట నుంచి సీఎం రేవంత్ రెడ్డి తప్పుకుంటున్నారని విమర్శించారు.

ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ముఖం చాటేస్తోందని కేటీఆర్ అన్నారు. దీంతో తెలంగాణ నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరుగుతోందని తెలిపారు. మొదటి ఏడాదిలో నియామకాలు చేపట్టాలని ప్రియాంక గాంధీ కూడా చెప్పారని ఆయన ప్రస్తావించారు. ఆ మాట అమలై ఉంటే ప్రభుత్వం ఇప్పటికే కూలిపోయేదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారని తెలిపారు. ఆ తరువాత కొత్త నోటిఫికేషన్లు లేకుండా రాష్ట్రంలో “రిక్రూట్‌మెంట్ జీరో” పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుమని పదివేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదని అన్నారు. జాబ్ క్యాలెండర్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని తెలిపారు.

కేవలం ఉద్యోగాల విషయంలోనే కాకుండా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. రైతుబంధు విషయంలో కూడా మూడు దఫాలుగా ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పిన హామీ కూడా ఇంకా అమలు కాలేదని చెప్పారు.

ఆరు గ్యారెంటీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల ఆగ్రహం ప్రభుత్వానికి తగలడం ఖాయమని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ అశోక్ నగర్ వరకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ యువత సంఘటిత శక్తి త్వరలో కనిపిస్తుందని అన్నారు. ఇక ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.

Read More
Next Story