
ఎమ్మెల్యేల కుటుంబాలతో నారా లోకేష్ విందు సమావేశాలు...
ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులకు మంగళగిరి చేనేత చీరలు కానుక. రాజకీయ కోణం ఏమిటి?
శాసన సభ్యులతో అనుబంధం పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఆయన ఈ రోజు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారికి విందు ఇచ్చారు.కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పిల్లలతో ఆడుకున్నారు. ఎమ్మెల్యేలతో స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. పరిష్కార మార్గాలు చర్చించారు. ఈ అనుబంధం వెనక ఉన్న రాజకీయ కోణం చర్చనీయాంశం అవుతున్నది. గతంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇపుడు లోకేష్ కుటుంబాలతో సాన్నిహిత్యం పెంచుకోవాలనుకోవడం విశేషం.
అమరావతి, ఉండవల్లి నివాసంలో శనివారం మధ్యాహ్నం గుంటూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల పరిధి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఈ సమావేశం నిర్వహించారు. కుటుంబసభ్యులను స్వాగతించిన లోకేష్, వారితో ఆప్యాయంగా మాట్లాడారు. చిన్నపిల్లలతో కబుర్లు చెబుతూ సరదాగా గడిపారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రాజకీయాలకు దూరంగా కుటుంబ విషయాలు, బాగోగులు, విద్య, క్రీడల గురించిన అర్థవంతమైన చర్చలు సాగాయి. చదువు, కెరీర్ ఒక్కటే జీవితం అని అందరూ భావిస్తున్నారని, స్పోర్ట్స్ కూడా కెరీర్ గా పిల్లలు ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని లోకేష్ సూచించారు. అంతా కలిసి ఒకేచోట భోజనం చేస్తూ, మాట్లాడుకున్నారు. మొత్తం నాయకులంతా తమ కుటుంబాలతో తరలి రాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వనభోజనాల్లా కనుల`విందు`గా సాగింది. లీడర్లు తనకు ఇచ్చిన వినతుల లేటెస్ట్ స్టేటస్ రిపోర్టులను లోకేష్ స్వయంగా వారికి అందజేశారు. తన నియోజకవర్గమైన మంగళగిరి చేనేతను ప్రమోట్ చేయడంలో భాగంగా ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులకు మంగళగిరి చేనేత చీరలు కానుకగా అందించారు.

