తెలంగాణ పాలిటిక్స్‌లో ‘మధు పార్క్ రిట్జ్’ చిచ్చు!
x

తెలంగాణ పాలిటిక్స్‌లో ‘మధు పార్క్ రిట్జ్’ చిచ్చు!

గాంధీ స్మృతివనం సమీపంలో మధు పార్క్ రిట్జ్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాదోపవాదాలు


తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన గాంధీ స్మృతివనం.. రాజకీయంగా చిచ్చు పెట్టింది. మధు పార్క్ రిట్జ్ కారణంగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అదే విధంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌ను అపార్ట్‌మెంట్ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మధ్యతరగతి వాళ్లంటే ప్రభుత్వానికి ఇంత లోకువా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు ఉంది అనుకుంటే.. ఆ ఇంటిని ప్రభుత్వమే లాగేసుకోవాలనుకోవడం దారుణమని విమర్శనాస్త్రాలలు ఎక్కుపెడుతున్నారు. గాంధీ స్మృతివనం సమీపంలో ప్రతిపాదిత ఈ నిర్మాణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక చేసిన ఈ ప్రాజెక్ట్ చుట్టూ అభివృద్ధి, పరిరక్షణ, రాజకీయ లాభనష్టాలపై తీవ్ర వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇది కేవలం రియల్ ఎస్టేట్ అంశం కాదు. మూడు ప్రధాన పార్టీల మధ్య సూటి పోరుగా మారింది.

వివాదానికి బీజం పడిందెక్కడంటే..?

గాంధీ స్మృతివనం పరిసరాల్లో వాణిజ్య నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో మొదట స్థానిక స్థాయిలో చర్చ ప్రారంభమైంది. స్మారక ప్రదేశం ప్రశాంతత దెబ్బతింటుందని కొందరు అభ్యంతరం తెలిపారు. తర్వాత ఈ అంశం రాజకీయ వేదికపైకి వచ్చింది. భూవినియోగ మార్పులు ఎప్పుడు జరిగాయి? ఎవరూ అనుమతులు ఇచ్చారు? పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? వంటి ప్రశ్నలు వరుసగా లేవనెత్తబడ్డాయి. అభివృద్ధి పేరిట స్మారక ప్రాంతాల స్వరూపం మారకూడదనే వాదన బలపడింది. మరోవైపు నగర విస్తరణలో ఇలాంటి ప్రాజెక్టులు సహజమని కొందరు వాదిస్తున్నారు. ఇలా మొదలైన చర్చ క్రమంగా రాజకీయ చిచ్చుగా మారింది.

బీఆర్ఎస్ వాదన: చట్టబద్ధ ప్రక్రియే

బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాజెక్ట్‌పై వచ్చిన విమర్శలను రాజకీయ ఉద్దేశ్యంతోనివిగా పేర్కొంటున్నారు. తమ ప్రభుత్వ కాలంలో తీసుకున్న ప్రతి నిర్ణయం నిబంధనల ప్రకారమే జరిగిందని చెబుతున్నారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన అనుమతులు సంబంధిత అధికారుల ద్వారా మంజూరు అయ్యాయని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పెంచుతున్నాయని ఆరోపిస్తున్నారు. నగరానికి పెట్టుబడులు రావడం మంచిదేనని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వాదిస్తున్నారు. స్మారక ప్రదేశ గౌరవం దెబ్బతినేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. మొత్తం వివాదాన్ని రాజకీయంగా పెంచుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఏ చట్టం ప్రకారం నోటీసులిస్తున్నారు: హరీష్ రావు

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరిట మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ప్రజలకు మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెట్టారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో జీవితాలను కూలగొడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్‌కు డీపీఆర్ లేదని, ఎఫ్‌టీఎల్ తేలలేదని, పర్యావరణ అనుమతులు లేవని, సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ జరగలేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఏ చట్టం ప్రకారం ఇండ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించారు. మూసీ శుద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఎస్టీపీలు నిర్మించి, కాళేశ్వరం పైపులైన్ల ద్వారా గోదావరి నీళ్లతో శుద్ధి చేయాలని సూచించారు. కానీ అభివృద్ధి పేరుతో పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.

మధు పార్క్ బాధిత కుటుంబాలను పరామర్శించిన హరీశ్‌రావు, ఒక తల్లి నీళ్ల ట్యాంకులో విషం కలిపి చంపమని ఆవేదన వ్యక్తం చేసిన మాట తనను కలచివేసిందని తెలిపారు. మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు జీవితకాలపు కల అని, దాన్ని కూల్చడం అంటే బతుకును కూల్చడమేనని అన్నారు. అధికారులు జేసీబీలు పంపి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పక్కనే ఉన్న ఓపెన్ ల్యాండ్స్‌ను అభివృద్ధి చేసుకోవచ్చని, కానీ సొంతింటి కలను ఛిద్రం చేయవద్దని సూచించారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ఎంతదూరమైనా వెళ్తామని, బీఆర్ఎస్ పార్టీ చట్టపరంగా పూర్తి స్థాయి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

స్మారక గౌరవమే ప్రధానము: బీజేపీ

బీజేపీ నాయకులు గాంధీ స్మృతివనం ప్రాధాన్యాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ ప్రాంతం చారిత్రకంగా, భావోద్వేగంగా ప్రజలకు ముఖ్యమని చెబుతున్నారు. ఇలాంటి ప్రదేశం పక్కనే భారీ వాణిజ్య నిర్మాణం సరైంది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. అనుమతుల ప్రక్రియపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. భూవినియోగ మార్పులు చట్టబద్ధమా కాదా అనే అంశంపై స్పష్టత కావాలని కోరుతున్నారు. స్మారక ప్రాంతాల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని చెబుతున్నారు. అభివృద్ధి అవసరమే అయినా, చారిత్రక స్థలాల గౌరవం కాపాడాలనే వాదనను బలంగా వినిపిస్తున్నారు.

సీఎం దృష్టికి నేను తీసుకెళ్తా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మధు పార్క్ రిట్జ్‌ అపార్ట్‌మెంట్‌ను కూల్చకుండా ఉంచడానికి తాను బాధ్యత వహిస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం అపార్ట్‌మెంట్ బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన వారికి ధైర్యం చెప్పారు. ‘‘నోటిఫికేషన్ పరిశీలన పూర్తికాకుండా జారీ అయి ఉండొచ్చు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి నేను తీసుకెళ్తా. నోటీసులను ఉపసంహరించేలా ప్రయత్నాలు చేస్తాను’’అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే తనపై ఏ పార్టీ నాయకులు కూడా రాజకీయంగా ఆరోపణలు చేయొద్దని, సమస్యను పరిష్కరించడమే తన లక్ష్యమని వివరించారు. ఒకవేళ ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించకపోతే.. దీనిని కేంద్ర రక్షణశాఖ మంత్ిర రాజ్‌నాథ్ సింగ్ దగ్గరకు తీసుకెళ్తానని తెలిపారు.

గత ప్రభుత్వ వైఫల్యాలే కారణం: కాంగ్రెస్

మధుపార్క్ అంశంపై కాంగ్రెస్‌ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఈ సమస్యకు మూలం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై అనవసరంగా నిందలు మోపుతున్నారని కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ గుర్తుచేశారు. 2012లో అమల్లో ఉన్న జీఓ ప్రకారం మధు పార్క్ బిల్డర్లకు 30 మీటర్ల బఫర్ ఉండాల్సి ఉండగా కేవలం 9 మీటర్ల బఫర్ చూపించి నాళా మీద అనుమతి ఇచ్చారని చెప్పారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం అనుమతులు ఇచ్చిన అవినీతి నిర్ణయాలే అమాయక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల తప్పు లేదని స్పష్టం చేశారు.

అపార్ట్‌మెంట్ వాసులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని బిల్డర్లు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు తెలిపారు. నగర అభివృద్ధి, మూసీ నది పునరుజ్జీవం, మెట్రో ఫేజ్–2, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు సీఎంరేవంత్ రెడ్డి కృషితో కొనసాగుతున్నాయని వివరించారు. డీపీఆర్ లేకపోవడం కారణంగా విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. సబర్మతి, గంగా నదుల పునరుజ్జీవనంలో ఆక్రమణలను తొలగించిన విధంగానే అవసరమైతే ఇక్కడ కూడా చర్యలు తీసుకుంటామని హరిష్ రావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ప్రజలను బాధ్యులను చేయరాదని అభివృద్ధి పనులను ఏ పరిస్థితిలోనూ ఆపలేమని తెలిపారు. 2012కి ముందు ఉన్న రికార్డులు కావాలంటే అందించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలిపారు.

స్థానికులేమంటున్నారు

స్థానికుల్లో విభిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఒక వృద్ధుడు ఈ ప్రాంతం ప్రశాంతత కోల్పోతుందని అన్నారు. స్మారక స్థలం పక్కనే వాణిజ్య నిర్మాణం రావడం తగదని అభిప్రాయపడ్డారు. కుటుంబాలతో వచ్చే వారికి ఇబ్బందులు కలగవచ్చని చెప్పారు. ఒక మహిళ ట్రాఫిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే రద్దీ ఎక్కువగా ఉంటుందని, పెద్ద ప్రాజెక్ట్ వస్తే మరింత ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు.

మరో యువకుడు అభివృద్ధి అవసరమని అన్నారు. పెట్టుబడులు వస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఒక వ్యాపారి ఈ ప్రాజెక్ట్ వల్ల వ్యాపారాలు చైతన్యం పొందవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని చెప్పారు.

‘వదిలి వెళ్లడం కుదరదు’

“ఏండ్ల తరబడి మేము కష్టపడి రూపాయి రూపాయి పొదుపు చేసి నిర్మించిన మా అపార్ట్‌మెంట్‌ను వదిలి వెళ్లలేము’’ అని అపార్ట్‌మెంట్ నివాసి ఎంవీ రమణారెడ్డి స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలను వివిధ రూపాల్లో ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రజలను ఇబ్బంది పెట్టి, తనకు విగ్రహాలు ఏర్పాటు చేయాలని గాంధీ ఎప్పుడూ కోరలేదు. మాకు ఇక్కడి అపార్ట్‌మెంట్ కూల్చి జెయింట్ వీల్స్ ఏర్పాట్లు చేయమని చెబుతున్నారు. జాయింట్ వీల్‌ అని ఉంటే, అది సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందే పెట్టాలి. మన ఇంట్లను కూల్చుతామంటే ఏ పరిస్థితిలోనూ మేము ఒప్పుకోలేము. ప్రభుత్వం ఏం చేసినా ప్రజల సమ్మతితో చేయాలి” అని తెలిపారు.

‘విగ్రహాల కోసం ప్రజలను ఇబ్బంది పెడతారా’

ప్రభుత్వ నిర్ణయాన్ని అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. “450 కుటుంబాలను రోడ్డు పాలు చేసి, మెమోరియల్ ఏర్పాటు చేస్తామని, గాంధీకి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రకటన ప్రజలను ఇబ్బంది పెడుతోంది. మా అపార్ట్‌మెంట్ ఖాళీ చేయడం వల్ల ఇక్కడి ప్రజలకు ఏ ప్రయోజనం వస్తుందో చెప్పండి. వెంటనే ఖాళీ చేస్తామనుకుంటే కూడా, మేము ఇక్కడ 20 ఏళ్లుగా నివసిస్తున్న మా ఇండ్లను కూల్చి జాయింట్ వీల్స్, విగ్రహాలు, మ్యూజియంలు ఏర్పాటు చేయమని ఎలా ఒప్పుకుంటాం. గాంధీకి మెమోరియల్ ఏర్పాటుకు ప్రభుత్వానికి స్థలమే దొరకడం లేదా? కోర్టును ఆశ్రయించి, న్యాయం వచ్చే వరకు మేము పోరాటం చేస్తాము” అని పేర్కొన్నారు.

ఈ మధుపార్క్ రిట్జ్ అంశం అభివృద్ధికేమోకానీ.. పార్టీ మధ్య రాజకీయ రగడకు మాత్రం మంచి వేదికగా మారింది. ఈ అంశంపై మూడు పార్టీలు మూడు విధాలుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. స్థానికులు కన్నీటి పర్యంతం అవుతున్నా.. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా ఎటువంటి స్పందన లేకపోవడంతో.. ప్రతిపక్షంలోని పార్టీలు తమ దాడులకు మరింత పదును పెట్టాయి.

Read More
Next Story