
జీవన్ రెడ్డిపై మహేష్ కుమార్ గుర్రు..
కాంగ్రెస్‌కు సేవలందించిన నాయకుడు పార్టీపై విమర్శలు చేయడంపై టీపీసీసీ చీఫ్ స్పందిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.
జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంతో చేసిందని, 14సార్లు టికెట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆయన సొంత పార్టీపైనే ఆలోచనపాలోచన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలన వల్ల తెలంగాణ తిరోగమనం చెందుతుందన్నారు. రేవంత్ దిగిపోతే కానీ రాష్ట్రం బాగుపడదంటూ జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. వాటిపై తాజాగా మహేష్ కుమార్ స్పందిస్తూ.. జీవన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్‌పైన విమర్శలు చేసే ముందు గతంలో బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు జీవన్ రెడ్డి సమాధానాలు చెప్పాలని మహేష్ కుమార్ అన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని పేర్కొంటూ, ఆయనను విమర్శించే హక్కు జీవన్‌రెడ్డికి ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై జీవన్‌రెడ్డి చేసిన విమర్శలను గుర్తు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, భవిష్యత్తులో అవి కలిసే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిపారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఎవరికీ మేలు జరగలేదని కూడా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల విషయంలో, ఆధారాలు ఉంటేనే చర్చకు రావాలని మహేశ్ గౌడ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. నిరాధార విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ, పార్టీకి వచ్చిన నాయకత్వం అదే వేదిక నుంచి ఎదిగిందని తెలిపారు. పలువురు నేతలు కూడా అదే సంస్థ నుంచి వచ్చినవారేనని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా, జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేతల విమర్శలు మరింత ముదురుతున్నాయి. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

