మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే
x

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ చేరడం తాను చేసిన తప్పని, దాని వల్ల రవ్వంగ మేలు జరగలేదన్న మహిపాల్ రెడ్డి.


పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం తాను చేసిన తప్పని అన్నారు. పార్టీ మారాలన్న తన నిర్ణయం వల్ల తనకు గానీ, నియోజకవర్గ ప్రజలకు గానీ వెంట్రుకవాసి మేలు జరగలేదని అసంతృప్తి వ్యక్తం శారు. పటాన్‌చెరు జీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు, కేవలం పార్టీ అనుచరులతోనే సమావేశమయ్యారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరడం తప్పు అని ఆయన చెప్పారు. దాంతో నియోజకవర్గానికి, ప్రజలకు, తనకే ఏ లాభం కలగలేదని పేర్కొన్నారు. గతంలో మూడు సార్లు భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో BRS అభ్యర్ధులను గెలిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. “పటాన్‌చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల 104 కౌన్సిలర్లను గెలిపించేందుకు విభాగాల వారీగా ప్లాన్ చేయాలి. అందరూ కలిసి పని చేస్తే మాత్రమే విజయానికి అవకాశాలు ఉంటాయి” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు కారణమయ్యాయి. ఎన్నికల ముందు నేతల మాటలు స్థానిక రాజకీయాల్లో వ్యూహాత్మక ప్రభావం చూపే అవకాశాలు కల్పిస్తున్నాయి.

పార్టీ మార్పును ఒప్పుకున్న ఎమ్మెల్యే

ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిరాయింపుల విషయంలో విచారణను వేగవంతం చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. విచారణ జరిపి పటాన్‌చెర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహా ఆరుగురికి క్లీన్ చిట్ ఇచ్చారాయన. వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, స్పష్టత లేదని అన్నారు. అయితే ఇప్పుడు తాను పార్టీ మారి తప్పు చేశాన్న మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు.. కీలకంగా మారాయి.

మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం

మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని తెలంగాణ రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో తమ వ్యూహాలకు తుదిమెరుగులు అద్దుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తమ ఆధిపత్యాన్ని చూపాలని కాంగ్రెస్ భావిస్తే, రాష్ట్ర రాజకీయాల్లో తమ బలాన్ని చూపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సాధించే ఫలితాలపై ప్రభావం చూపుతుందా? అన్న చర్చ మొదలైంది. రాష్ట్రమంతా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏమైనా ఉంటే ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story