అజ్ఞాత జీవితంనుండి రాజకీయాల్లోకి మావోయిస్టు కీలక నేత దేవ్ జీ
x
Devuji

అజ్ఞాత జీవితంనుండి రాజకీయాల్లోకి మావోయిస్టు కీలక నేత దేవ్ జీ

తొందరలోనే రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని అనుకున్నట్లు తెలిపారు


తాజాగా లొంగిపోయిన మావోయిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నారు. ఏ పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెడతారు ? ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందా ? అనేవిషయాలను తొందరలోనే ప్రకటించబోతున్నారు. మంగళవారం మధ్యాహ్నం మావోయిస్టుపార్టీలో పనిచేసిన అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డితో పాటు మరికొందరు సభ్యులు లొంగిపోయిన విషయం తెలిసిందే. డీజీపీ ఎం శివధరరెడ్డి ఆధ్వర్యంలో మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా పోలీసులు చూపించారు.

మామూలుగా లొంగిపోయిన మావోయిస్టు నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేకపోతే మరో వ్యాపారమో చేసుకుంటారు. కొందరు సెక్యూరిటిగా కూడా పనిచేస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టు నేతలకు వారికి ఉన్న ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వం ప్రోత్సాహకంగా కొంత డబ్బులు ఇస్తుంది. దాంతో కొందరు ప్రముఖులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. లొంగిపోయిన వారి స్ధాయినిబట్టి చాలామంది తమ సొంతూర్లలో కిరాణాకొట్ల లాంటివి పెట్టుకున్నారు.

ఇపుడు విషయం ఏమిటంటే లొంగిపోయిన మావోయిస్టుపార్టీ నేతల్లో కీలకమైన దేవ్ జీ మీడియాతో మాట్లాడుతు అనారోగ్య కారణాలవల్ల తాను లొంగిపోయినట్లు చెప్పారు. దశాబ్దాల రహస్య జీవితానికి స్వస్తిపలికి బహిరంగ జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా తానునమ్మిన జీవితం కోసమే పనిచేసినట్లు చెప్పారు. ఇపుడు లొంగిపోయిన తాను భవిష్యత్తులో ప్రజలకోసమే పనిచేస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు కూడా చెప్పారు. తొందరలోనే రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. తాను అనుకుంటున్నట్లు భవిష్యత్ రాజకీయ జీవితానికి ఇబ్బందులు కలిగించవద్దని దేవ్ జీ మీడియాను రిక్వెస్టు చేసుకున్నారు. ఇపుడు ఇంతకన్నా వివరాలను చెప్పలేనని, శేష జీవితాన్ని రాజకీయాల్లోనే గడపాలని కోరుకుంటున్నట్లు 62 ఏళ్ళ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి చెప్పారు.

తిరుపతి గురించి

తిరుపతి కోరుట్లలోని అంబేద్కర్ నగర్ లో 1963లో పుట్టారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తిరుపతి తండ్రి పేరు వెంకట్ నర్సయ్య. 1980ల్లో మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితుడై అందులో చేరారు. కిందస్ధాయిలో దళసభ్యుడిగా చేరి అంచలంచెలుగా ఎదిగి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో కీలక బాధ్యతలు నిర్వహించేస్ధాయికి చేరుకున్నారు. తర్వాత డైరెక్టుగా మావోయిస్టు పార్టీలోకి వచ్చి సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేశారు. దేవ్ జీ తలకు ప్రభుత్వం రు.1 కోటి వెలకట్టింది.


సీతక్కే ఆదర్శమా ?


మావోయిస్టుపార్టీలో పనిచేసి లొంగిపోయిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన వారిలో సీతక్క అలియాస్ దనసరి అనసూయ మాత్రమే కనబడతారు. సీతక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు మండలంకు చెందిన నేత. మావోయిస్టుపార్టీలో సంవత్సరాలు పనిచేసి లొంగిపోయారు. తర్వాత తెలుగుదేశంపార్టీలో చేరి యాక్టివ్ గా ఉన్నారు. తర్వాత పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ములుగు నుండి ఎంఎల్ఏగా గెలిచి ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. బహుశా సీతక్క రాజకీయ జీవితమే దేవ్ జీని కూడా రాజకీయాల్లోకి ప్రవేశించేట్లుగా ప్రేరణ ఇచ్చిందేమో.

Read More
Next Story