ఎన్ని లక్షలమంది ఎన్నికలను బహిష్కరించారో తెలుసా ?
x
Municipal elections

ఎన్ని లక్షలమంది ఎన్నికలను బహిష్కరించారో తెలుసా ?

14 లక్షలమంది ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండిపోయారంటే అర్ధమేంటి ?


బుధవారం జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగులో ఒక విషయం కొట్టొచ్చినట్లు కనబడింది. అదేమిటంటే లక్షలాదిమంది ఓటర్లు పోలింగుకు దూరంగా ఉండిపోయారు. పోలింగ్ శాతం 73.01 అని ఘనంగా కనబడుతున్నప్పటికీ మరింత పోలింగ్ జరగాల్సున్నా జరగలేదన్నది వాస్తవం. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలో 53.52 లక్షల ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకోవాల్సుంది. అయితే 14 లక్షలమంది ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండిపోయారంటే అర్ధమేంటి ? నిజానికి వీరంతా పోలింగులో పాల్గొని ఎవరో ఒక అభ్యర్ధికి లేదా తమ ఓట్లను నోటాకు వేసే ఆప్షన్ ఉంది.

నోటా ఆప్షన్ ను కూడా వద్దనుకుని ఏకంగా పోలింగునే బహిష్కరించారనే అనుకోవాలి. ఓటింగులో పాల్గొనని 14 లక్షలమందిలో మహిళా ఓటర్లు 7.09 లక్షలు కాగా పురుషులు 6.97 లక్షలమంది ఉన్నారు. ఇతరులు 507 మంది కూడా ఓటింగుకు హాజరుకాలేదు. నిజామాబాద్ కార్పొరేషన్లో ఏకంగా 40శాతం ఓటర్లు తమ ఓటుహక్కును ఉపయోగించుకోలేదు. మొన్నటి డిసెంబర్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలో ఈ జిల్లాలో 85.30శాతం ఓటింగ్ నమోదవ్వటం గమనార్హం. గ్రామ పంచాయతీలంటే గ్రామాలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టే ఓటింగ్ కూడా చాలా ఎక్కువగానే జరిగింది. అలాగే పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనాలు ఎక్కువగానే పాల్గొంటారని ఎన్నికల కమిషన్ అంచనావేసింది. అయితే 14 లక్షలమంది ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ జరిగింది చౌటుప్పల్ లో 91.91 శాతం నమోదవ్వగా అతి తక్కువగా నందికొండ మున్సిపాలిటీలో 59.68 శాతం నమోదైంది. అన్నీ మున్సిపాలిటీల్లోను చూస్తే సగటున 73 శాతం ఓటింగ్ నమోదైంది. 7 కార్పొరేషన్లలో అత్యధికం నల్గొండ కార్పొరేషన్లో 77శాతం ఓటింగ్ నమోదైంది. అతి తక్కువగా నిజామాబాద్ కార్పొరేషన్లో 59.12 శాతం ఓటింగ్ జరిగింది. అన్నీ కార్పొరేషన్లలో సగటున 66శాతం ఓటింగ్ నమోదైంది.

ఇన్ని లక్షలమంది ఓటింగులో పాల్గొనలేదంటే అందుకు కారణాలు ఏమయ్యుండచ్చు ? అనే విషయాలను గమనిస్తే పాలక కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యర్ధుల మీద జనాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందనుకోవాలి. ఇదేసమయంలో ప్రతిపక్షం బీజేపీ మీద కూడా నమ్మకం లేకనే ఓటింగుకు దూరంగా ఉండిపోయారని అనుకోవాలి. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైన జనాలు సంతృప్తిగా ఉండుంటే కాంగ్రెస్ అభ్యర్ధులకు అనుకూలంగా ఓట్లేస్తే ఓటింగ్ శాతం బాగా పెరిగుండాలి.

అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో బీఆర్ఎస్ వైపు జనాలు మొగ్గారు అనుకునేందుకు కూడా లేదు. ఎందుకంటే ఓటింగ్ రాని జనాల వల్ల బీఆర్ఎస్ కూడా నష్టపోయిందనే చెప్పాలి. అంటే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనుకూలత/వ్యతిరేకత లేదని అర్ధమవుతోంది. ఇదేసమయంలో బీఆర్ఎస్, బీజేపీ మీద కూడా పెద్దగా భ్రమలు లేవన్న విషయం అర్ధమవుతోంది. అందుకనే కాంగ్రెస్ అభ్యర్ధులకు ఓట్లు వేయలేక అలాగని తమ ఓటుతో ప్రతిపక్షాలకు మద్దతుగా నిలవలేక ఏకంగా ఓటింగుకే దూరంగా ఉండిపోయారని అర్ధమవుతోంది.

Read More
Next Story