మంత్రిని చేయకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి
x

మంత్రిని చేయకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ దుమారం. మంత్రి పదవి లేదంటే సీఎం లక్ష్యమని స్పష్టం.


తనకు మంత్రి ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని అవుతానంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన గంటల వ్యవధిలోనే రాజగోపాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చలకు దారితీశాయి. రాజగోపాల్ రెడ్డి.. రేవంత్‌ను ఛాలెంజ్ చేస్తున్నారా? పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

రాబోయే రోజుల్లో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని, అది జరగకపోతే భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థాయికే వెళ్లే లక్ష్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గాన్ని ప్రజలు చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని తాను చూసుకుంటానని చెప్పారు. తనకు అడుక్కోవడం అలవాటు లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి గౌరవప్రదంగా పదవి దక్కాలన్నదే తన విధానమని తెలిపారు.

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవి విషయంలో ఎక్కువ కాలం వేచి చూడబోనని, అవసరమైతే తానే ముందుకు వెళ్లే పరిస్థితి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్న చర్చ మొదలైంది.

ఇది తొలిసారి కాదని, గతంలో కేబినెట్ విస్తరణ సమయంలో తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను గుర్తించి సముచిత స్థానం కల్పించాలని అప్పట్లో అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో చర్చకు దారి తీసి క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లినట్టు తెలిసింది.

శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ గెలుపును పురస్కరించుకుని విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి గెలిచిన కౌన్సిలర్లతో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని, లేదంటే తన రాజకీయ లక్ష్యం మరింత ఎత్తుకు వెళ్తుందని కార్యకర్తలకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట మునుగోడు కాంగ్రెస్ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్‌తో పాటు నూతన కౌన్సిలర్లు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి రాజకీయాలు మరో మలుపు తిరిగే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.

Read More
Next Story