జీవన్ రెడ్డిని బతిమలాడుకుంటున్న మంత్రులు
x
Jeevan Reddy with Minister Sridhar Babu and Adluri Laxman

జీవన్ రెడ్డిని బతిమలాడుకుంటున్న మంత్రులు

శనివారం మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎంఎల్ఏ మేడిపల్లి సత్యం తదితరులు జీవన్ రెడ్డితో తనింట్లో భేటీ అయ్యారు


మంత్రుల వ్యవహారం చూస్తుంటే ఏదో సామెత గుర్తుకువస్తోంది. పార్టీలో ఉన్నంతకాలం మాజీమంత్రి, సీనియర్ నేత టీ జీవన్ రెడ్డిని ఎవరు పట్టించుకోలేదు. తీరా ఆయన పార్టీ మారటానికి డిసైడ్ అయిన తర్వాత ఇపుడు తీరిగ్గా వచ్చి బతిమలాడుకుంటున్నారు. విషయం ఏమిటంటే కరీంనగర్లో జీవన్ రెడ్డి ఇంటికి శనివారం మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎంఎల్ఏ మేడిపల్లి సత్యం తదితరులు జీవన్ రెడ్డితో తనింట్లో భేటీ అయ్యారు. జీవన్ తో మాట్లాడి బుజ్జగించే బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. అయితే ఉత్తమ్ ఫెయిలైనట్లు అర్ధమవుతోంది. అందుకనే ఈరోజు ఇద్దరు మంత్రులు, ఒక ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళి పార్టీకి రాజీనామా చేయద్దని జీవన్ ను బతిమలాడుకుంటున్నారు.

దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న జీవన్ ఇపుడు పార్టీని వదిలేయాలని ఎందుకు అనుకున్నారు ? ఎందుకంటే దీనికి బీజం 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే పడింది. అదేమిటంటే అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా జగిత్యాలలో పోటీచేసిన జీవన్, బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జీవన్ ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో తనకు ప్రాధాన్యత దక్కుతుందని జీవన్ అనుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణల కారణంగా సంజయ్ బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఎప్పుడైతే సంజయ్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారో అప్పటినుండి జీవన్ కు కష్టాలు మొదలయ్యాయి.

రేవంత్ ను నమ్ముకుని కాంగ్రెస్ లోకి ఫిరాయించిన కారణంగా సంజయ్ కు పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత పెరిగిపోయింది. అప్పటికే సంజయ్ అంటే బాగా మంటమీదున్న జీవన్ మరింతగా మండిపోయారు. ఇదే సమయంలో ఇద్దరు మద్దతుదారుల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. వేర్వేరు ఘర్షణల్లో జీవన్ మద్దతుదారులు ఇద్దరు హత్యకు గురయ్యారు. జీవన్ పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోలేదు. దాంతో అప్పటినుండి సంజయ్ అంటేనే జీవన్ మండిపోతున్నారు. దానికీతోడు జీవన్ కు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనతో ఒక్కసారిగా ప్రత్యేకంగా పిలిచి మాట్లాడిందిలేదన్న ఉక్రోషం జీవన్లో బాగా పెరిగిపోయింది.

గుర్తింపు కోల్పోయిన జీవన్

రాజకీయాల్లోకి వచ్చేవారంతా డబ్బు సంపాదనకే కాదు, గౌరవం, మర్యాద కోసం కూడా వస్తారు. పదిమందిలో గుర్తింపు దక్కాలని కోరుకుంటారు. అలాంటిది ఆశించినది ఏదీ దక్కకపోగా అవమానాలు ఎదురవుతున్నాయనే కోపం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో ఈమధ్యనే జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటి వార్డుల్లో సంజయ్ మద్దతుదారులకే టికెట్లు దక్కాయి. అలాగే ఛైర్మన్ గా కూడా సంజయ్ మద్దతుదారుడే అయ్యాడు. సంజయ్ పైన అనర్హత వేటుపడుతుందేమో అని ఎదురుచూసిన జీవన్ కు ఆ ఆశలు కూడా అడిగంటిపోయాయి. అందుకనే పార్టీలో ఉంటు అవమానపడేకన్నా పార్టీ మారిపోవటమే మంచిదని డిసైడ్ అయ్యారు. మద్దతుదారులు కూడా జీవన్ ను పార్టీ మారటానికే ఓటు వేశారు. దాంతో వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో పాటు మరికొందరు నేతలు జీవన్ తో మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ విషయం మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చేసింది. దాంతో పార్టీ అలర్టయ్యింది.

పార్టీమారటానికి జీవన్ ఈనెల 25వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అదేరోజు జగిత్యాలలోని ఒక ఫంక్షన్ హాలును జీవన్ బుక్ చేసుకున్నారని తెలిసింది. మద్దతుదారులతో సమావేశం పెట్టుకుని రాజీనామాను జీవన్ ప్రకటించబోతున్నారని, వెంటనే ఆయన మద్దతుదారులు కూడా పార్టీకి రాజీనామాలు ప్రకటించబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే ఈరోజు ఉదయం మంత్రులు దుద్దిళ్ళ, అడ్లూరి, ఎంఎల్ఏ సత్యం తదితరులు హడావుడిగా జగిత్యాలలోని జీవన్ ఇంటికి చేరుకుని మంతనాలు చేస్తున్నారు. జీవన్ ను రేవంత్ పిలిపించి మాట్లాడి సర్దుబాటు చేసుంటే తనలోని అసంతృప్తి తగ్గిపోయేదేమో. సంజయ్ పార్టీలోనే ఉంటాడు, జీవన్ కూడా పార్టీలోనే ఉండాలని రేవంత్ అనుకునుంటే మాజీమంత్రిని పిలిపించుకుని మాట్లాడి ఉండేవాడే అనటంలో సందేహంలేదు.

జీవన్ వెళ్ళిపోయినా నష్టంలేదని రేవంత్, పార్టీ కూడా అనుకున్నట్లుంది. అందుకనే జీవన్ ను ఎవరు పట్టించుకోలేదు. అయితే జీవన్ కు పార్టీ అధిష్ఠానంతో బాగా సన్నిహిత సంబంధాలున్నాయి. బహుశా పైనుండి రేవంత్ కు గట్టి ఆదేశాలు వచ్చి ఉండచ్చు. అందుకనే మంత్రులను జీవన్ ఇంటికి రేవంత్ పంపించి మాట్లాడిస్తున్నారనే టాక్ పార్టీలో పెరిగిపోతోంది. మంత్రుల రాయబారం ఏమవుతుందో ? జీవన్ ఏమి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story