మున్సిపల్ పోరులో హస్తం హవా:  41శాతం ఓట్లతో కాంగ్రెస్ ఘన విజయం
x
మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార హస్తం హవా

మున్సిపల్ పోరులో హస్తం హవా: 41శాతం ఓట్లతో కాంగ్రెస్ ఘన విజయం

అసెంబ్లీ కంటే ఎక్కువ ఓట్లు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంది. 116 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో సీట్ల పరంగా మాత్రమే కాదు, ఓట్ల శాతంలోనూ కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం పోలైన ఓట్లలో 41 శాతం సాధించి 1,537 వార్డులను కైవసం చేసుకున్న హస్తం పార్టీ 66 మున్సిపాలిటీలను స్వీప్ చేయడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం పెరగడం అధికార పార్టీకే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు సంకేతంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో సీట్లతోపాటు ఓట్ల శాతంలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1,12,2,260 ఓట్లతో అధికార హస్తం పార్టీ ముందుంది. పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం మున్సిపాలిటీల్లో 2,995 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్ పార్టీ 1537 వార్డులు కైవసం చేసుకొని 66 మున్సిపాలిటీలను స్వీప్ చేసింది.

కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ కంటే పెరిగిన ఓట్ల శాతం

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లశాతం కంటే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం పెరిగింది. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.40శాతం ఓట్లు రాగా 64 సీట్లతో ఆ పార్టీ విజయం సాధించింది. అంటే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 41 శాతానికి పెరిగాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల కంటే రెండు శాతం ఓట్లు పెరిగాయి.

బీఆర్ఎస్ పార్టీకి తగ్గిన ఓట్ల శాతం

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 8,64,209 ఓట్లతో రెండోస్థానానికి పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీకి 32 శాతం ఓట్లతో 781 వార్డులను మాత్రమే గెల్చుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 37.35 శాతం ఓట్లు రాగా, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 32 శాతానికి తగ్గాయి.

కమలానికి స్వల్పంగా పెరిగిన ఓట్ల శాతం

మరో వైపు కమలం పార్టీ 336 వార్డులను గెలుచుకోగా, ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 14 శాతం ఓట్లే దక్కాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. బీజేపీకి గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.90 శాతం ఓట్లు రాగా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి స్వల్పంగా పెరిగి 14శాతం అయ్యాయి. మజ్లిస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో రెండు శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.మజ్లిస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ కేవలం 2 శాతం ఓట్లే దక్కాయి. ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీకి 70 వార్డులను గెల్చుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 271 వార్డుల్లో విజయం సాధించారు. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీకి 0.8 శాతం, సీపీఎంకు 0.7 శాతం, సీపీఐకు 0.7 శాతం, జనసేన పార్టీకి 0.3 శాతం బీఎస్పీకి 0.02 శాతం ఓట్లు లభించాయని తాజా విశ్లేషణలో తేలింది.
మొత్తంగా చూస్తే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తన ఓట్ల శాతాన్ని పెంచుకుని స్థానిక స్థాయిలో బలాన్ని మరింత పటిష్టం చేసుకోగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు గణనీయమైన వెనుకడుగు పడింది. బీజేపీకి స్వల్ప లాభం, ఇతర పార్టీలకు పరిమిత ప్రాభవం మాత్రమే కనిపించాయి. స్థానిక సంస్థల స్థాయిలో వచ్చిన ఈ తీర్పు భవిష్యత్ రాజకీయ పోరాటాలకు దిశానిర్దేశం చేసేలా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Read More
Next Story