
మున్సిపల్ ఎన్నికలొస్తున్నాయ్ జాగ్రత్త: సీఎం రేవంత్
మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష. ప్రచార వ్యూహాలు, సర్వే నివేదికలు, అప్రమత్తతపై కీలక ఆదేశాలు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై హైదరాబాద్‌లో మంగళవారం తన కేబినెట్ మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రచార వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని సీఎం సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగానే నివేదికలు ఉన్నాయని మంత్రులకు తెలిపారు. సర్వే వివరాలను వారికి అందజేశారు. చాలా మున్సిపాలిటీల్లో విజయం సాధించే అవకాశముందని పేర్కొన్నారు.
అయితే, చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఎక్కడైనా రెబల్స్ ఉంటే వెంటనే రాజీ చేసుకోవాలని ఆదేశించారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
సర్వేల్లో వెనకబడిన మున్సిపాలిటీలను ఉదాహరణలతో వివరించారు. జిల్లాల పర్యటనల వివరాలను మంత్రుల నుంచి తెలుసుకున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. రోజువారీ నివేదికలు తనకు అందించాలని స్పష్టం చేశారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్న సూచన కూడా ఇచ్చారు.
తెలంగాణలోని పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా, ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడికానున్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా తమ వ్యూహాలతో రంగంలోకి దిగాయి. పోలింగ్‌కు ముందు ప్రచారమే ఫలితాలను ప్రభావితం చేయనుంది.

