Telangana Jagruthi president Kavitha
x

దేశ అంశాల కోసం జాతీయ కమిటీ కూడా: కవిత

కొత్త పార్టీ నిర్మాణంపై కవిత కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు.


తమ పార్టీ కేవలం రాష్ట్ర అంశాలపైనే కాకుండా జాతీయ అంశాలపై కూడా దృష్టి సారిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడించారు. అందుకోసమే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీలో జాతీయ కమిటీని కూూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీని ప్రకటించిన సందర్భంగానే పార్టీ లక్ష్యాలు, ప్రణాళికలు వంటి అంశాలను కవిత వివరించారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు మునీరాబాద్‌లో పార్టీని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే రోజు జెండా, ఎజెండా, నిబంధనలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పార్టీ కార్యకలాపాల్లో 95 శాతం ఫోకస్ తెలంగాణపైనే ఉంటుందని కవిత తెలిపారు. గ్రామాలు, యువత, మహిళలు, రైతుల సమస్యలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

దేశ అంశాలకు జాతీయ కమిటీ

దేశ స్థాయిలో గ్యాస్, పెట్రోల్, బీసీ బిల్లు వంటి అంశాలపై స్పందించేందుకు జాతీయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు జాతీయ సమస్యలపై కూడా పార్టీ స్పందిస్తుందని వివరించారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయినప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలు పూర్తిగా సాధించలేదని కవిత పేర్కొన్నారు. ప్రజలు ప్రతిరోజూ సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కొత్త రాజకీయ శక్తి అవసరమైందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ప్రమాదాలు, భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. చిన్నపిల్లల భద్రత నుంచి ప్రజా రవాణా వరకు సమస్యలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మక్క రైతులకు కనీస ధరలు అందకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయని కవిత వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. జాగృతి సంస్థగా గతంలో రైతులు, పేదల కోసం పనిచేసిన విషయాలను గుర్తు చేశారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం అందించినట్లు తెలిపారు. భూదాన్ భూముల సమస్యపై పోరాటం చేసి పరిష్కారం సాధించినట్లు వివరించారు. యువత, మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, కార్మికులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వికలాంగులు అందరూ పార్టీలో భాగస్వామ్యం కావాలని కవిత ఆహ్వానించారు. ప్రతి వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

ప్రజల్లో చైతన్యమే లక్ష్యం

ప్రజలు ప్రశ్నించే ధోరణి పెరగాలని, రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని కవిత సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. ఏప్రిల్ 25న మునీరాబాద్‌లో జరిగే సభకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఉదయం నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పార్టీ ప్రారంభానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామని వెల్లడించారు. మేధావులు, యువత నుంచి సూచనలు తీసుకుంటామని చెప్పారు.

Read More
Next Story