
బీఆర్ఎస్ ఓటమికి కారణాలు చెప్పిన కవిత
ఫిబ్రవరి 12 సమావేశంలో ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ బడ్జెట్‌లో పెన్షన్, ఉద్యోగం, స్థలం, సంక్షేమ బోర్డు ప్రకటించాలని డిమాండ్.
బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను పట్టించుకోకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందంటూ పరోక్షంగా చురకలంటించారు. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, తన రాజకీయ ప్రణాలికలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పేరుతోనే పార్టీని స్థాపిస్తానని వెల్లడించారు. జాగృతి రానున్న కాలంలో రాజకీయశక్తిగా మారుతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వాదం కోసమే తాను రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు తెలిపారు. తాను స్థాపించే పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా ఉండబోదని స్పష్టం చేశారు.
తెలంగాణ చరిత్రను గుర్తు చేస్తూ రామ్‌జీ గోండు, కొమరం భీమ్, దొడ్డి కొమరయ్య త్యాగాలను ప్రస్తావించారు. 1969 జై తెలంగాణ ఉద్యమం నుంచి 2001లో ప్రారంభమైన రాజకీయ దశ వరకు పోరాటాల పరంపరను వివరించారు. 2014లో రాష్ట్రం సాధించిన తర్వాత ఉద్యమకారులకు తగిన గౌరవం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి పదవులు వచ్చినా, ఎక్కువ మంది గుర్తింపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో కీలక హామీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి నెలకు ₹25,000 పెన్షన్, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలని, 250 గజాల స్థలం ఇవ్వాలన్న హామీ అమలు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రకటించాలని అన్నారు.
ఉద్యమకారుల కోసం ప్రత్యేక యాప్ ప్రారంభించినట్టు తెలిపారు. అందులో నమోదు చేసుకున్న వారికి ఐడీ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ లోకల్స్‌కు 20 శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. ఉద్యమకారుల ఆకాంక్షలను పట్టించుకోకపోతే ప్రజలు గమనిస్తారని హెచ్చరిస్తూ, హామీల అమలుకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
హైదరాబాద్‌లో పెద్ద భవనాలు, ఫ్లైఓవర్లు, అభివృద్ధి కనిపిస్తున్నా స్థానిక యువతకు ప్రైవేట్ ఉద్యోగాల్లో అవకాశాలు తక్కువగా ఉన్నాయనే వాదన వినిపింది. అందుకే తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాల్లో లోకల్స్‌కు 20 శాతం రిజర్వేషన్ కోరుతూ ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని ప్రతిపాదించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పోరాట భాషే అర్థమవుతుందన్న వ్యాఖ్యలూ వినిపించాయి. 1969 నుంచి పోరాడినందుకే తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు కూడా పోరాటం చేస్తేనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే, ఉద్యమకారుల ఆకాంక్షలను పట్టించుకోకపోతే అధికారానికి దూరమయ్యే పరిస్థితులు వస్తాయని హెచ్చరిక తరహా వ్యాఖ్యలు చేశారు.
గత పాలకులు అహంకారం ఎక్కువై ఓడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. కేసీఆర్ హయాంలో అసెంబ్లీ ముందు ఉద్యమకారుడు ఆత్మాహుతి చేసుకున్న ఘటనను గుర్తు చేశారు. రేవంత్‌ను కూడా ఉద్యమకారులు బంగ్లా నుంచి బయటకు గుంజుతారని విమర్శించారు.

