రాజ్యసభ కోసం ఓవర్ టు ఢిల్లీ
x
Sonia Gandhi, Rahul Gandhi and Mallikarjuna Kharge

రాజ్యసభ కోసం ఓవర్ టు ఢిల్లీ

అంతా ఢిల్లీ, ఢిల్లీ అని చెప్పుకునే చివరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది


కాంగ్రెస్ పార్టీలో వ్యవహారాలు ఎలాగుంటాయో అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలన్నా, బీఫారమ్ లు అందించాలన్నా ఢిల్లీలోనే డిసైడ్ అవుతుంది. మంత్రులుగా ఎవరుండాలన్నా డిసైడ్ అయ్యేది ఢిల్లీలోనే. చివరకు ముఖ్యమంత్రి ఎంపిక కూడా ఢిల్లీలోనే ఫైనల్ అవుతుంది. అంతా ఢిల్లీ, ఢిల్లీ అని చెప్పుకునే చివరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రాల్లో బలమైన నేతలుంటే అధిష్ఠానం విలువ పడిపోతుందన్న ఆలోచనతోనే సర్వం ఢిల్లీమయం చేసేశారు దశాబ్దాల క్రితమే.

ఇపుడిదంతా ఎందుకంటే రాజ్యసభ ఎంపీలుగా ఇద్దరు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సుంటుంది. నామినేషన్లు వేయటానికి ఈనెల 5వ తేదీ ఆఖరు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం హైదరాబాద్ విచ్చినపుడే రాజ్యసభ అభ్యర్ధుల పేర్లు ఖరారవుతాయని అనుకున్నారు. అయితే వచ్చినపని చూసుకుని వెళ్ళేటపుడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను ఢిల్లీకి రమ్మని చెప్పారు. దాంతో రేవంత్, మహేష్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళుతున్నారు. అంటే తెలంగాణలో రాజ్యసభ అభ్యర్ధులు ఎవరు అన్న విషయం ఈరోజు రాత్రో లేకపోతే బుధవారమో ఢిల్లీలోనే ఫైనల్ అవుతుంది.

అందుకనే రేవంత్, మహేష్ తో పాటు రాజ్యసభ టికెట్ల రేసులో ఉన్నవారంతా పోలోమంటు ఢిల్లీబాట పట్టారు. మహేష్ మీడియాతో మాట్లాడుతు రాష్ట్రంలోని నేతల్లో ఒకరికే అవకాశం ఇస్తారా ? లేకపోతే రెండుస్ధానాల్లోను తెలంగాణ వాళ్ళకే ఇస్తారా అన్నది బుధవారం తేలుతుందన్నారు. పోటీలో నలుగురు సమర్ధులైన బీసీ నేతలున్నారని చెప్పిన మహేష్ ఆ నలుగురు ఎవరు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. జస్టిస్ సుదర్శనరెడ్డి రాజ్యసభస్ధానం కావాలని అడగలేదని మాత్రమే చెప్పారు. జస్టిస్ సుదర్శనరెడ్డి తనకు రాజ్యసభ స్ధానం ఇవ్వాలని అడిగినట్లు ఎవరూ చెప్పలేదు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసికూడా పోటీకి ఇండియా కూటమి తరపున దిగినపుడే జస్టిస్ కు రాజ్యసభ ఎంపీ పదవిని పార్టీ అధిష్ఠానం లేకపోతే రేవంత్ హామీ ఇచ్చారని మాత్రమే మీడియాలో వచ్చింది. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీ తరపున రాజ్యసభ రేసులో రాజ్యసభ మాజీ ఎంపీ వీ హనుమంతరావు, లోక్ సభ మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కీ గౌడ్, ఈరవర్తి అనీల్ ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళు కాకుండా ప్రభుత్వ సలహాదారు, రేవంత్ కు అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి, సీనియర్ నేత హర్కార కూడా ఉన్నారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండుస్ధానాల్లో ఎవరికి లక్కీ ఛాన్స్ దొరుకుతుందన్నది బుధవారంకు ఫైనల్ అయిపోవటం ఖాయం.

Read More
Next Story