
పట్టణ ఓటర్లు కూడా రేవంత్ కు జై కొట్టారు
కాంగ్రెస్ లో ఇంతమంది ఏకతాటిపైకి వచ్చి పార్టీ విజయం కోసం పనిచేయటం కేవలం రేవంత్ వల్లే సాధ్యమైందని చెప్పాలి
అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జరిగిన అన్నీ ఎన్నికల్లోను ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తు రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంతే పార్టీకి కూడా మార్గదర్శనం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అన్నది. తాజాగా వెల్లడైన 114 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 91 చోట్ల గెలవగా, బీఆర్ఎస్ 17, బీజేపీ రెండు చోట్ల అతికష్టంమీద గెలిచింది. మిగిలిన మున్సిపాలిటీల్లో ఎంఐఎం, సీపీఐ, ఇండిపెండెంట్లు ఛైర్మన్లుగా ఉన్నారు.
రేవంత్ వ్యూహం గనుక సరిగా వర్కవుట్ అయ్యుంటే కాంగ్రెస్ కు మరిన్ని మున్సిపాలిటీలు వచ్చుండేవి అనటంలో సందేహంలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో నమ్మిన వాళ్ళే రేవంత్ ను దెబ్బకొట్టారు. దాంతో కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీల సంఖ్య 91కి దగ్గర ఆగిపోయింది. మరో రెండు చోట్ల ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఇక బీఆర్ఎస్ విషయం చూస్తే గెలిచిన 17 మున్సిపాలిటీల్లో ఐదింటిని గ్రేటర్ పరిధిలోనే గెలుచుకున్నది. మిగిలిన 12 లో ఎక్కువగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనివే. అంటే బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో పట్టుంది అని అర్ధమవుతోంది.
బీఆర్ఎస్ పరిస్ధితి కొంచెం విచిత్రంగానే ఉంది. 2996 వార్డుల్లో 781 వార్డుల్లో గెలిచామని చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కారుపార్టీ చివరకు 781 వార్డులకు పరిమితమైందంటే అందుకు కారణాలను పార్టీ నేతలు విశ్లేషించుకోవటంలేదు. ధర్మపురి, కొసిగి, మక్తల్, భైంసా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క వార్డు కూడా గెలవలేదు. అలాగే చాలా మున్సిపాలిటీల్లో మూడోప్లేసుతో సరిపెట్టుకున్నది.
సమన్వయమే పెద్ద బలం
మున్సిపల్ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్ధులు, ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల అభ్యర్ధులు కూడా గెలిచే అవకాశాలుంటాయి. అందుకనే ఇపుడు కూడా 40 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది. అయితే చాలా చోట్ల తిరుగుబాట్ల బెడద లేకుండా రేవంత్ ప్రత్యేక దృష్టిపెడితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అందుకనే చాలాచోట్ల అభ్యర్ధులకు రెబల్స్ బెడద, ప్రచారంలో సమన్వయలోపం, ఎలక్షనీరింగులో సమస్యలు ఎదురయ్యాయి. అన్నీ మున్సిపాలిటీల్లోని సమస్యలను తెలుసుకుని పరిష్కరించే యంత్రాంగం బీఆర్ఎస్ లో పెద్దగా కనబడకపోవటమే ఆశ్చర్యమేసింది. సీనియర్ నేతలంగా ఏమయ్యారో అర్ధంకావటంలేదు.
స్ధానిక ఎన్నికలంటేనే ముఖ్యంగా అధికారపార్టీకి అనుకూలంగా జరుగుతుందని స్వయంగా కేటీఆరే చెప్పారు. మరలాంటపుడు 91 మున్సిపాలిటీలను గెలుచుకున్న కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అని ఆరోపణలు చేయటం ఎందుకు ? తాము అధికారంలో ఉన్నపుడు అధికారదుర్వినియోగంతోనే 90శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్నట్లు అంగీకరించినట్లేనా ?
రేవంత్ వ్యూహాలు ఫలిస్తున్నాయా ?
ఎన్నిక ఏదైనా సరే అన్నీజాగ్రత్తలు తీసుకోవటం వల్లే కాంగ్రెస్ గెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జరిగిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక మొదలు ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక, పంచాయతీ తర్వాత ఇపుడు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. ప్రతిఎన్నికను రేవంత్ సవాలుగానే తీసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, ప్రతిపక్షమైన బీజేపీలకు ఎట్టిపరిస్ధితిల్లోను గెలుపు దక్కనీయకూడదనే. దీనికి విరుద్ధంగా కేటీఆర్ రాజకీయం ఉంటోంది.
ఎన్నికలు వస్తున్నాయంటేనే రేవంత్ యావత్ మంత్రులను, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలను రణక్షేత్రంలోకి దింపేస్తున్నారు. సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రతిరోజు పరిస్ధితులను స్వయంగా సమీక్షిస్తున్నారు. అందరు కలిసి క్యాడర్ ను ముందుండి నడిపిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇంతమంది ఏకతాటిపైకి వచ్చి పార్టీ విజయం కోసం పనిచేయటం కేవలం రేవంత్ వల్లే సాధ్యమైందని చెప్పాలి. అందుకనే ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి.
సోషల్ మీడియాకే పరిమితమా ?
ఇక కేటీఆర్ విషయం చూస్తే క్షేత్రస్ధాయిలో తక్కువగా, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తీసుకుని రేవంత్ పై ఆరోపణలు, విమర్శలతో ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూటుల్లో రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంతో రేవంత్ పైన బురదచల్లేందుకు ఉపయోగపడుతుంది కాని ఓట్లు తీసుకురావన్న విషయాన్ని కేటీఆర్ ఎప్పటికి గ్రహిస్తారో ? కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజాలెంత అన్న విషయాన్ని జనాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అందుకనే కేటీఆర్ ఆరోపణలను జనాలు పెద్దగా పట్టించుకోవటంలేదు. అందుకనే కేటీఆర్ ఆశించిన ఫలితాలకు అసలు ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి.
బీజేపీకి మైనస్సే
తాజా ఫలితాలు బీజేపీకి పెద్ద మైనస్ అనేచెప్పాలి. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు అసలు బీజేపీని కనీసమాత్రంగా కూడా పట్టించుకోలేదన్న విషయం అర్ధమైంది. విచిత్రం ఏమిటంటే బీజేపీలోని ఎనిమిది మంది ఎంపీల్లో కేవలం బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లో మాత్రమే జనాలు బీజేపీని గెలిపించారు. మిగిలిన ఏడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఒక్క మున్సిపాలిటీలో కూడా బీజేపీ గెలవలేదు. దీనికి కారణాలు మూడు కనబడుతున్నాయి. మొదటిది పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావుకు పార్టీ మీద పట్టులేకపోవటం. రెండోకారణం ఎంపీలు, ఎంఎల్ఏలను సమన్వయం చేసుకోలేకపోవటం. మూడోకారణం ఎంపీలు, ఎంఎల్ఏల మధ్య సఖ్యత లేకపోవటం. ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఎవరిదారి వాళ్ళదే అన్నట్లుగా వ్యవహరించారని అర్ధమవుతోంది.
బీజేపీలోని ప్రజాప్రతినిధుల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలన్న పట్టుదల పెద్దగా కనబడలేదు. అందుకనే పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ఇంతటి ఘోర పరాజయం ప్రాప్తించింది. సమన్వయ లోపంతోనే తమపార్టీ ఓడిపోయిందని అధ్యక్షుడు అంగీకరించారు. అలాగే తమపార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్-ఎంఐఎం కుమ్మక్కయ్యాయని చేసిన ఆరోపణలోని డొల్లతనం బయటపడింది. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్-ఎంఐఎం ఒకదానికి మరొకటి సహకరించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా మున్సిపాలిటీల్లోని ఫలితంతో రేవంత్ తొందరలో జరగబోయే పరిషత్ ఎన్నికల్లో మరింతగా రెచ్చిపోయి పనిచేస్తాడనటంలో సందేహంలేదు. ఆ ఫలితాలు ఎలాగుంటాయో చూడాలి.

