
ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఖండించాలన్న ఓవైసీ
ఇరాన్ సుప్రింలీడర్ అయుతుల్లా ఆలీ ఖమేనీ హత్య చట్టవిరుద్ధం, అనైతికం అని మండిపడ్డారు
మధ్య ప్రాచ్య దేశాలపై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను భారత్ ఖండించాలని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు సలాహుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఆదివారం ఓవైసీ మాట్లాడుతు ఇరాన్ పై దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ సుప్రింలీడర్ అయుతుల్లా ఆలీ ఖమేనీ హత్య చట్టవిరుద్ధం, అనైతికం అని మండిపడ్డారు. ఖమేని షియా సమాజానికి గొప్ప నాయకుడు అని కితాబిచ్చారు.
ఇరాన్ పై దాడులను తక్షణమే ముగించాలని, ఈ విషయంలో భారత ప్రభుత్వం తన పాత్రను పోషించాలని సూచించారు. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెట్ దాడులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అస్దిరత నెలకొనే అవకాశాలున్నాయని ఓవైసీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇరాన్ పై జరుగుతున్న దాడులను కేంద్రప్రభుత్వం తక్షణమే ఖండించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్ధాయిలో శాంతి ప్రయత్నాలకు భారత్ ప్రభుత్వం ముందడుగు వేయాలని సూచించారు.
గల్ఫ్ దేశాల్లో సుమారు కోటిమంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నట్లు చెప్పారు. యుద్ధం ఇలాగే కొనసాగితే అందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందన్నారు. ఈ యుద్ధం కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలోని జనాల ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కల్లోలం తప్పదని హెచ్చరించారు. భారతీయులు యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల్లో చిక్కుకుపోయే ప్రమాదముందని ఎంపీ ఆందోళన వ్యక్తంచేశారు.

