
తెలంగాణలో పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయ్
ఇపుడున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 178 లేదా 179కి పెరుగుతాయి
రాజకీయ నిరుద్యోగులకు నిజంగా శుభవార్తనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలోనే తెలంగాణలో పార్లమెంటు, అసెంబ్లీ సీట్లసంఖ్య పెరగబోతోంది. ప్రస్తుత పార్లమెంట్ పునర్విభజన బిల్లును కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఉభయసభల్లో ప్రవేశపెట్టబోతున్న బిల్లులకు మద్దతు ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపక్షాల నేతలతో భేటీ అవబోతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టబోతున్న పునర్విభజన బిల్లుకు ప్రతిపక్షాలు కూడా మద్దతిచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయంటే అన్నీ పార్టీలకు సంతోషమే కదా. నియోజకవర్గాల పెంపువల్ల జనాలకు వచ్చే లాభం ఏమిటి అన్నవిషయాన్ని మాత్రం మనం చర్చించకూడదు.
ఎందుకంటే మామూలు జనాలకు ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. రాజకీయ నేతలు లేదా రాజకీయ నిరుద్యోగులకు మాత్రం నియోజకవర్గాలు పెరుగుతున్నాయంటే పిచ్చ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పోటీచేయటానికి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి. పునర్విభజన బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఉభయసభల ఆమోదం తీసుకోవాలని అమిత్ షా ప్రయత్నిస్తున్నారు.
17 నుండి 26కు పెరుగుతాయా ?
పునర్విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదం పొందుతుంది అనటంలో ఎలాంటి సందేహంలేదు. బిల్లు పాసై నియోజకవర్గాలు పెరిగితే అన్నీరాష్ట్రాల్లోను నేతలు లాభపడతారు. తెలంగాణలో ఇపుడు ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలు 25 లేదా 26కి పెరుగుతాయి. అలాగే ఇపుడున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 178 లేదా 179కి పెరుగుతాయి. మొన్నటివరకు నియోజకవర్గాలసంఖ్య పెరిగితే తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుండి 153కి పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. అలాంటిది సడెన్ గా 178 లేదా 179కి పెరుగాయని అంచనాలు ఆశ్చర్యంగానే ఉంది.
పునర్విజనభిల్లు ఆమోదంపొందటమే ఆలస్యం కేంద్రప్రభుత్వం నియోజకవర్గాల పెంపుపై కసరత్తు మొదలుపెట్టేస్తుంది. 2011 జనాభాలెక్కల ఆధారంగానే నియోజకవర్గాలు పెరుగబోతున్నాయని సమాచారం. ఒకసారి కసరత్తు మొదలైతే కాని ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయన్న లెక్క తేలదు. ఇప్పటికైతే సగటున ప్రతి పార్లమెంటు సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కేసీఆర్ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజన వల్ల అయోమయం పెరిగిపోయింది. తొందరలోనే కేంద్రప్రభుత్వం టేకప్ చేయబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల జిల్లాల స్వరూపం మారిపోవటం ఖాయమని అర్ధమవుతోంది.
మహిళా నియోజకవర్గాలివేనా ?
అలాగే నియోజకవర్గాలు పెరిగితే మహిళలప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈపార్లమెంటు సమావేశాల్లోనే మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును కూడా ప్రవేశపెట్టాలనే యోచనలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. చట్టసభల్లో అంటే పార్లమెంటు, అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లు కూడా పాసైతే అప్పుడు వారికి కూడా కొన్ని నియోజకవర్గాలను రిజర్వ్ చేయాల్సుంటుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పోగా మిగిలిన ఓపెన్ సీట్లలో మళ్ళీ 33శాతం మహిళలకు కేటాయించాల్సుంటుంది. మహిళలకు రిజర్వేషన్ అంటే అత్యధికంగా ఓటర్లున్న నియోజకవర్గాలనే మహిళలకు కేటాయించబోతున్నారనే సమాచారం వినిపిస్తోంది.
అందుబాటులోని సమాచారం ప్రకారం మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను పరిశీలిద్దాం. మెదక్, సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్ లాంటి నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో మహిళాఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీటినే మహిళలకు రిజర్వ్ చేసే అవకాశాలున్నాయి.

