
కేసీఆర్ విచారణ పూర్తి.. ఆ అంశాలపైనే ఫుల్ ఫోకస్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తుది నిర్ణయాధికారం ఎవరిదన్న కోణంలో సిట్ ప్రశ్నలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విచారణ ముగిసింది. మధ్యాహ్నం మొదలైన విచారణ దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఈ విచారణలో సెట్ అధికారులు పలు కీలక అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆదివారం నందినగర్‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు దాదాపు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలపాటు ప్రశ్నించారు. ఇప్పటికే ఇతరుల విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.నివాసంలోనే ఐదు గంటల సిట్ ప్రశ్నలు
మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ నివాసం రెండో అంతస్తులోని గదిలో విచారణ మొదలైంది. రెండోసారి జారీ చేసిన నోటీసుల మేరకు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఇప్పటికే ఇతరుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు కొనసాగినట్టు సమాచారం. ఈ మొత్తం ప్రక్రియను అధికారులు ఆడియో, వీడియో రూపంలో నమోదు చేశారు.
ఆ వీడియోలు మీకు ఎలా వచ్చాయ్: సిట్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన వీడియోలు బీఆర్ఎస్ వద్దకు ఎలా చేరాయన్న అంశంపై సిట్ స్పష్టత కోరింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తుది నిర్ణయం ఎవరు తీసుకున్నారన్న కోణంలోనూ ప్రశ్నలు వేసింది. అధికారుల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా వారిని కొనసాగించాల్సి వచ్చిన పరిస్థితులపై వివరణ అడిగినట్టు తెలుస్తోంది.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులతో నేరుగా సంప్రదింపులు జరిగాయా అనే అంశం కూడా విచారణలోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ డేటా ఎవరి ద్వారా అందిందన్న విషయంపై సిట్ లోతుగా ఆరా తీసింది. ట్యాపింగ్ ఆదేశాలపై స్పష్టత పొందేందుకు అధికారులు ప్రయత్నించారు.
పార్టీ నిధులపై ఆరా
ట్యాపింగ్ పరికరాల కోసం పార్టీ నిధులు వినియోగించారా అనే అంశం విచారణలో కీలకంగా మారింది. ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన దాతల ఫోన్ నంబర్లు ట్యాపింగ్ జాబితాలో ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నలు కూడా సిట్ లేవనెత్తింది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లపై నిఘా పెట్టారా అనే కోణంలోనూ వివరాలు కోరినట్టు సమాచారం. ఎమ్మెల్యే కొనుగోలు కేసు సమయంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు ముందుగానే ఎలా తెలిసాయన్న అంశంపై కూడా ప్రశ్నలు కొనసాగాయి.
గతంలో విచారణకు హాజరైన వారు ఇచ్చిన స్టేట్మెంట్లను కేసీఆర్ ముందు ఉంచి సిట్ అధికారులు వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యాక కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం సిట్ అధికారులు నివాసం నుంచి వెళ్లిపోయారు.
ఇదే సమయంలో విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో తెలంగాణ భవన్ వద్ద ఆందోళన కొనసాగింది. మొత్తంగా ఈ విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరో కీలక దశకు చేరినట్టు కనిపిస్తోంది. తదుపరి చర్యలపై సిట్ సమీక్ష కొనసాగిస్తోంది.

