
సిట్ విచారణకు సిద్ధంగా ఉంటా: కేసీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. నందినగర్‌లో నోటీసులు అంటించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఏసీపీకి లేఖ రాశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు నందీనగర్ ఇంట్లో సిద్ధంగా ఉంటానని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. తీవ్ర చర్చల నేపథ్యంలో సిట్ విచారణకు హాజరవడానికి ఆయన ఓకే చెప్పారు. అందుకోసం ఆదివారం మధ్యాహ్నం 3 గంటటలకు నందీనగర్‌లోని నివాసంలో తాను సిద్ధంగా ఉంటానని చెప్తూ సిట్ అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన పలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.
ఆ నోటీసులు చెల్లవ్: కేసీఆర్
సిట్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నోటీసును చట్ట ప్రకారం ఇవ్వలేదని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. నందినగర్‌లోని తన ఇంటి గోడపై నోటీసులు అంటించడం చెల్లదని, ఇది తన గౌరవానికి భంగం కలిగించేలా ఉందని తెలిపారు.
బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు దాటిన వ్యక్తుల స్టేట్‌మెంట్ వారి నివాసంలోనే రికార్డు చేయాల్సి ఉంటుందని కేసీఆర్ గుర్తు చేశారు. తాను ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉంటున్నందున అక్కడే విచారణ జరగాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఏసీపీకి తనపై నోటీసులు జారీ చేసే అధికార పరిధి లేదని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా చిరునామాను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. గతంలో హరీశ్‌రావు విషయంలో సిద్దిపేట చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో నోటీసులు ఇచ్చిన అంశాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన
కేసీఆర్ లేఖ నేపథ్యంలో సిట్ అధికారులు మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించినట్లు సమాచారం. ఇదే సమయంలో కేసీఆర్ న్యాయ నిపుణులతో ఎర్రవల్లిలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.
కేసీఆర్ విచారణకు సహకరిస్తానని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అయితే భవిష్యత్తులో తనకు సంబంధించిన నోటీసులు ఎర్రవల్లి నివాసానికే పంపాలని సూచించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

