పరిగిలో హరీష్ రావు అరెస్ట్..
x

పరిగిలో హరీష్ రావు అరెస్ట్..

ఎన్ని అరెస్ట్‌లు చేసినా పరిగి రైతుల తరుపున తమ పార్టీ చేసే పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న హరీష్ రావు.


మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్‌లు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలవడానికి వెళ్తున్న క్రమంలో హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు అరెస్ట్‌తో పరిగిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు తమ నేతల అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వం అసలు రంగు బయటపడుతుందన్న భయంతోనే తమ పార్టీ నేతలను అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

అయితే పరిగి పర్యటనకు బయలుదేరుతున్న హరీష్ రావును పోలీసులు మంగళవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను అక్కడకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. కాగా తన హౌస్ అరెస్ట్‌పై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రేవంత్ రెడ్డి.. పేద రైతలను మోసం చేస్తోందని, వారికి న్యాయం అందించడం కోసం తాము నడుంబిగిస్తుంటే తమను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పేదల భూములపై రేవంత్ సర్కార్ చేస్తున్న దంయాత్రను అడ్డుకుంటామని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పరిగిలో మరో దమనకాండ జరుగుతోందాని, ఎన్ని అరెస్ట్‌లు చేసినా పరిగి రైతుల తరుపున తమ పార్టీ చేసే పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి సర్కార్.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల తరుపున పోరాటం చేస్తున్న తమను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రైతుల కష్టాలను పెడచెవిన పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను నేలకూలుస్తున్నారని, అభివృద్ధి పేరుతో రైతుల భూములను దోచుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భారీ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, దానికి అడ్డు వచ్చిన పేదలను తొక్కుకుంటూ పోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల తరుపున ఎవరూ లేరనుకుంటే మందబుద్దే అవుతోందని, పేదల తరుపున పోరాడటానికి బీఆర్ఎస్ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని అన్నారు.

Read More
Next Story