
తలసానిని కదలనీయని పోలీసులు, బచావో ర్యాలీపై ఉక్కుపాదం
కారులో నుండి బయటకు వచ్చిన తలసానికి పోలీసులకు మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది
సికింద్రాబాద్ బచావో ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సికింద్రాబాద్ పేరు వినబడకుండా చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్(BRS) నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మాజీమంత్రి, సనత్ నగర్ ఎంఎల్ఏ (Talasani)తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో శనివారం బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీని ప్లాన్ చేశారు. శనివారం ర్యాలీకి ముందస్తు అనుమతిచ్చిన పోలీసులు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అనుమతిని రద్దుచేస్తు తలసానికి మెసేజ్ పెట్టారు. అయినా సరే ఈరోజు ఉదయం పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు(Secunderabad) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీరోడ్డు దాకా ర్యాలీ చేయటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేసింది.
అయితే ముందిచ్చిన అనుమతిని రద్దు చేసినట్లు రాత్రి చెప్పిన పోలీసులు శనివారం ఉదయం నుండి నేతలను ఇళ్ళల్లో నుండి బయటకు రానీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇందులో భాగంగానే ఉదయం తలసానిని పార్టీ ఆఫీసులో నిర్భందించారు. పార్టీ ఆఫీసునుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గరకు చేరుకున్న కొందరు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలో ఉన్న పోలీసుస్టేషన్లకు తరలించారు. పోలీసుల ముందస్తుచర్యలతో బీఆర్ఎస్ ప్లాన్ చేసిన భారీ ర్యాలీ భగ్నమైనట్లే అనుకోవాలి.
ఇదే విషయమై మీడియాతో తలసాని మాట్లాడుతు తమ ర్యాలీకి పోలీసులు ముందు అనుమతిచ్చి శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అనుమతిని రద్దుచేస్తున్నట్లు మెసేజ్ పెట్టడం అన్యాయం అన్నారు. నల్లజెండాలు, కండువాలతో ర్యాలీని నిర్వహించాలని అనుకున్న విషయాన్ని ముందుగానే తాను పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తలసాని వివరించారు. ర్యాలీ రూటు మ్యాపును కూడా పరిశీలించిన పోలీసులు అధికారులు సడెన్ గా పర్మీషన్ రద్దుచేయటం వెనుక పెద్ద కుట్ర దాగున్నట్లు మండిపడ్డారు.
సికింద్రబాద్ పేరును లేకుండా చేయటానికి రేవంత్ సర్కార్ పెద్ద కుట్రచేస్తున్నట్లు తలసాని ఆరోపించారు. ఇప్పటికే మల్కాజ్ గిరి, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం చెబుతున్న విషయాన్ని తలసాని ప్రస్తావించారు. తమకు సికింద్రాబాద్ తో మట్టి సంబంధం ఉందని దాన్ని చెరపాలని ప్రభుత్వం అనుకున్నా సాధ్యంకాదన్నారు. శాంతిర్యాలీని అడ్డుకున్నంత మాత్రాన ప్రభుత్వం ఆందోళనను అణిచివేసినట్లు కాదన్నారు. ర్యాలీకి అనుమతి కోసం తాము కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని స్పష్టంచేశారు.
తలసానిని కదలనీయని పోలీసులు
పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన తర్వాత తలసాని బయటకు వచ్చారు. కారు ఎక్కిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. కారులో నుండి బయటకు వచ్చిన తలసానికి పోలీసులకు మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. తనింటికి వెళ్ళటానికి పోలీసుల అనుమతి అవసరంలేదని తలసాని సీరియస్ గా రియాక్టయ్యారు. తనింటికి వెళ్ళటానికి తనకు ఎవరి అనుమతి అవసరంలేదన్నారు. అయితే పోలీసులు వెనక్కు తగ్గకుండా తమ కారులో ఎక్కితే ఇంటిదగ్గర డ్రాప్ చేస్తానని పోలీసులు తలసానికి చెప్పారు. దాంతో ఏమి చెప్పాలో అర్ధంకాని తలసాని చివరకు తమ పార్టీ ఆఫీసులోకి వెళ్ళిపోయారు.

