పార్టీ ఆదేశంతోనే బీఆర్‌ఎస్‌కు రఘునందన్ ఓటు
x

పార్టీ ఆదేశంతోనే బీఆర్‌ఎస్‌కు రఘునందన్ ఓటు

ఇస్నాపూర్‌లో బీజేపీకి వార్డు లేకపోయినా ఎంపీ ఎక్స్‌ఆఫిషియోగా ఓటు. బీఆర్‌ఎస్ బలం 13. ఇండిపెండెంట్లే కీలకం.


తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.. తన ఎక్స్‌అఫీషియో ఓటును బీఆర్ఎస్‌కు వేశారు. ఇది తీవ్ర చర్చలకు దారితీసింది. అయితే పార్టీ ఆదేశాల మేరకే తాను అలా చేశానని రఘునందన్ రావు చెప్పడం మరింత సంచలనం రేపింది. చైర్మన్ ఎన్నికకు గంటల ముందు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఈ పరిణామం తీవ్ర చర్చకు దారితీసింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఒక్క వార్డు కూడా గెలవలేదు. అయినా రఘునందన్ రావు ఎక్స్‌ఆఫిషియో సభ్యుడిగా నమోదు అయ్యారు. దీంతో ఆయన ఓటు ఇప్పుడు కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జిన్నారం, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో బీజేపీ మంచి సంఖ్యలో వార్డులు గెలిచినా ఆయన ఇస్నాపూర్‌ను ఎంచుకున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్‌తో ముందస్తు అవగాహన సంకేతమై ఉండొచ్చని చర్చ సాగుతోంది. ఇస్నాపూర్ ఫలితాల్లో బీఆర్‌ఎస్ 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ 10 వార్డులు సాధించింది. నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఎక్స్‌ఆఫిషియో సభ్యుడిగా నమోదు అయ్యారు.

ఆయన బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్ బలం 13కు చేరింది. అయినా మ్యాజిక్ నంబర్‌కు ఇంకొకరి మద్దతు అవసరం ఉంది. బీఆర్‌ఎస్ ఇండిపెండెంట్ల మద్దతు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవాలంటే నలుగురు ఇండిపెండెంట్ల మద్దతు అవసరం. అదే సమయంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఎలెక్ట్‌లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రఘునందన్ రావు తన నిర్ణయంపై వివరణ ఇచ్చారు. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి తనపై ఎంపీగా పోటీ చేసిన నీలం మధు భార్య నీలం కవిత పోటీలో ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో గూడెం మహిపాల్ రెడ్డి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేయడంతో స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బీఆర్‌ఎస్‌కు ఓటు వేశానని చెప్పారు.

తాను గతంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, ఈ నిర్ణయాన్ని అతిశయంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాల్లో స్థానిక సమీకరణలు ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయం దగ్గరపడడంతో ఇస్నాపూర్‌లో చివరి నిమిషం వరకు రాజకీయ కదలికలు కొనసాగే అవకాశం ఉంది. ఫలితం ఏ వైపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Read More
Next Story