
రంజిత్ కోసం రేవంత్ భారీ స్కెచ్
రంజిత్ రెడ్డికి మంత్రిపదవి ఇస్తానన్న ప్రకటన రేవంత్ ఎందుకు చేశాడో ఎవరికీ అర్ధంకావటంలేదు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన పార్టీలో మంటలు మండిస్తోంది. వికారాబాద్ జిల్లాలో రేవంత్ మాట్లాడుతు ‘‘రంజిత్ రెడ్డికి మంత్రిపదవి ఇచ్చి పురపాలక సంఘాలను అభివృద్ధి చేసే ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తాను’’ అని ప్రకటించారు. ప్రత్యేకంగా మున్సిపాలిటీలకు నిధులు కేటాయించి మున్సిపాలిటీలను(Municipal elections) అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. (Revanth)రేవంత్ చేసిన ఈ ప్రకటనే ఇపుడు పార్టీలో మంటలకు కారణమైంది. (Ranjith Reddy)రంజిత్ రెడ్డికి మంత్రిపదవి ఇస్తానన్న ప్రకటన రేవంత్ ఎందుకు చేశాడో ఎవరికీ అర్ధంకావటంలేదు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి ? ఎప్పుడు తీసుకోవాలనే సంపూర్ణ స్వేచ్చ రేవంత్ కు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. నిజంగానే అంత స్వేచ్చ రేవంత్ కు ఉండుంటే ఈపాటికి మంత్రివర్గంలోకి తనకు కావాల్సిన వాళ్ళందరినీ తీసుకుని ఉండేవాడే.
అలాగే మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరించాలన్న ఛాయిస్ కూడా రేవంత్ కు ఉండదు. అన్నింటికీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. అలాంటిది ఇంత సడెన్ గా అదీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రంజిత్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు చెప్పటం వెనుక రేవంత్ వ్యూహం ఏమయ్యుంటుంది ? అన్నదే అర్ధంకావటంలేదు. పార్టీలో తనకు ఉన్న స్వేచ్చగురించి రేవంత్ కు బాగా తెలిసినా రంజిత్ రెడ్డికి మంత్రిపదవి అన్న ప్రకటన చేశారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు మున్సిపల్ శాఖ రేవంత్ దగ్గరే ఉంది.
అవకాశం ఎంతుంది ?
రంజిత్ కు మున్సిపల్ శాఖ ఇవ్వటం అన్నది అసలు పాయింటే కాదు. రంజిత్ ను మంత్రివర్గంలోకి ఎలాగ తీసుకుంటాడు అన్నదే అసలు పాయింట్. ఎందుకంటే 2024 పార్లమెంటు ఎన్నికల్లో రంజిత్ చేవెళ్ళ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. అప్పటినుండి పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. పైగా మంత్రివర్గంలో స్ధానం కోసం పార్టీ ఎంఎల్ఏల్లో చాలామంది పెద్దఎత్తున ప్రయత్నం చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఇబ్రహింపట్నం ఎంఎల్ఏ మల్ రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎంఎల్ఏ పీ సుదర్శనరెడ్డి లాంటి వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సుదర్శన్ కు మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రేవంత్ చేసిన ఏ ప్రయత్నమూ సక్సెస్ కాలేదు.
సుదర్శన్ కు మంత్రిపదవి ఇప్పించుకోలేకే చివరకు ప్రభుత్వ సలహాదారు అనే క్యాబినెట్ హోదాతో సరిపెట్టాడు రేవంత్. ఇక కోమటిరెడ్డి, మల్ రెడ్డి మంత్రిపదవి తమకు ఇచ్చి తీరాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మంత్రిపదవి రావటంలేదనే కోపంతో కోమటిరెడ్డి పార్టీలో, ప్రభుత్వంలో నానా కంపుచేస్తున్నారు. మూడుసార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినా రంగారెడ్డి జిల్లా నుండి మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యమే లేదు. మొదటిసారి తనతో పాటు 12మందిని మంత్రివర్గంలోకి రేవంత్ తీసుకున్నాడు. తర్వాత ముగ్గురితో విస్తరించాడు. తర్వాత మోహమ్మద్ అజహరుద్దీన్ ను మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. ఇంకో ఇద్దరికి ఛాన్సుంది.
చాలాకాలంగా వెయిటింగ్
రేవంత్ ప్రకటన కారణంగా ఎంఎల్ఏలు మండిపోతున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి, మల్ రెడ్డి సీఎం ప్రకటనపై తీవ్రస్ధాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఎంఎల్ఏలుగా తమను మంత్రివర్గంలోకి తీసుకోలేని రేవంత్ అసలు ఎంఎల్ఏనే కాని రంజిత్ కు మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. తమ మద్దతుదారులతో కూడా పై ఇద్దరు ఎంఎల్ఏలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
ఎవరిని అయినా మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎంఎల్ఏ లేదా ఎంఎల్సీ అయ్యుండాలి. రంజిత్ ఇపుడు ఎంఎల్ఏ కాదు ఎంఎల్సీ కూడా కాదు. ఎంఎల్ఏగా పోటీచేసి గెలిచే అవకాశం లేదు కాని ఎంఎల్సీ అయ్యే అవకాశాలున్నాయి. రంజిత్ ను ఎంఎల్సీ చేయాలన్నా అధిష్ఠానం అనుమతి కావాల్సిందే. ఇప్పటికిప్పుడు ఎంఎల్సీగా కూడా అవకాశాలు తక్కువే. అధికారంలోకి రాగానే ఎంఎల్సీలుగా ప్రొఫెసర్ కోదండరెడ్డి, అజహరుద్దీన్ ను ప్రతిపాదిస్తే గవర్నర్ దగ్గర ఫైల్ ఇప్పటికీ పెండింగులోనే ఉంది. ఎంఎల్సీగా ఏ అవకాశం వచ్చినా ముందు అజహరుద్దీన్ కు ఇవ్వాల్సిందే. ఎందుకంటే అజహర్ కూడా ఉభయసభల్లో ఎందులోను సభ్యుడు కాదు. ఏ సభలోను సభ్యుడు కాని వ్యక్తి మంత్రయితే ఆరుమాసాల్లోగా ఏదో ఒక సభలో సభ్యుడైతీరాలి.
అజహర్ మంత్రివర్గంలో చేరి ఏప్రిల్ కు ఆరుమాసాలు అవుతుంది. ఏప్రిల్ లోపు అజహర్ ను ఎంఎల్సీగా నియమించలేకపోతే మంత్రివర్గంలో నుండి తొలగించాల్సిందే తప్ప వేరే దారిలేదు. ఈ విషయాలేవీ రేవంత్ కు తెలీదని అనుకునేందుకు లేదు. అయినా రంజిత్ కు మంత్రి పదవి అని రేవంత్ ప్రకటించాడంటే అనాలోచితంగా అనే అవకాశంలేదు. ప్రకటన వెనుక రేవంత్ పెద్ద స్కెచ్చే వేసుంటాడు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముందు అధిష్ఠానం దగ్గర అనుమతి తీసుకునే రంజిత్ కు మంత్రిపదవి ప్రకటన రేవంత్ చేసుంటాడు అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా రంజిత్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే పార్టీలో మంటలు మండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది అర్ధమవుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

