జిల్లాల విభజనలో భాగంగా మా సమస్యను పరిష్కరించండి: జీవో 317 బాధిత ఉద్యోగులు
x

జిల్లాల విభజనలో భాగంగా మా సమస్యను పరిష్కరించండి: జీవో 317 బాధిత ఉద్యోగులు

జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్తున్న ప్రభుత్వం స్థానికత ఆధారంగా తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక అయిన 'స్థానికత' అంశం ఇప్పుడు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 కారణంగా తమ సొంత జిల్లాలను వదులుకోవాల్సి వచ్చిందని, సీనియారిటీ ప్రాతిపదికన జరిగిన కేటాయింపులు తమ ప్రాథమిక హక్కులను కాలరాశాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన యోచనలో ఉన్న నేపథ్యంలో, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన జీవో 317 వలన స్థానికత (ఉద్యోగం పొందే సమయంలో రికార్డులలో నమోదు చేసిన జిల్లా) కోల్పోయామని ఉద్యోగస్తులు ఆందోళన చేసినా వారిది అరణ్యరోదన అయ్యింది. ఈ సమస్య వలన 16,000 మంది ప్రభావితం అయ్యారని ఆ సమస్యపై పోరాడుతున్న ఉద్యోగస్థుల, ఉపాధ్యాయుల యూనియన్ పేర్కొంది. ఈ సందర్భంలోనే ప్రతి ఓటును తమ గెలుపుకు మెట్టుగా పరిగణించిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సమస్యపై అధ్యయనానికి ముగ్గురు మంత్రివర్గ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఏర్పడిన కమిటీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభ్యులుగా వున్నారు. అనేక సార్లు ఉద్యోగ వర్గాలతో సమావేశం అయిన ఈ కమిటీ అనారోగ్య కారణాల, భార్యా భర్తలు, మ్యూచువల్ కేటగిరీల్లో ఉద్యోగులు తమ స్వంత జిల్లాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ జీవో 243, 244, 245లను ప్రభుత్వం 1 డిసెంబర్ 2024లో జారీ చేసింది. ఈ ప్రమాణాల ప్రాతిపదిక పై బదిలీకి పచ్చ జెండా ఊపి ఆ ప్రక్రియను 31 డిసెంబర్ లోపు పూర్తి చేయాలని ఆదేశించింది.

సంతృప్తి చెందని ఉద్యోగులు తమ ఆందోళన స్థానికతను పునరుద్ధరించాలని, తెలంగాణ పోరాటానికి అదే ప్రాతిపదిక అని గుర్తు చేస్తున్నారు. “అనారోగ్య కారణాలు, భార్యా భర్తలు, మ్యూచువల్ కేటగిరీల్లో స్థానికత డిమాండ్ ను బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. 13 జిల్లాలలో ఆ సమస్యలను తీర్చింది. మరో 19 జిల్లాలలో అమలు చేయాల్సివుంది,” అని 317 బాధిత ఉద్యోగుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోయిన నాగేశ్వర రావు చెప్పారు.

తమ హామీని తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను తిరిగి విభజన చేయటానికి రిటైర్డ్ హై కోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ సందర్భంగా అయినా తమ సమస్యలను పరిష్కరించాలని 317 బాధిత ఉద్యోగుల పాలిటెక్నిక్ లెక్చరర్ వింగ్ ప్రెసిడెంట్ సందీప్ పొగుల కోరారు.

రాష్ట్ర ఏర్పాటు తరువాత 10 జిల్లాలను 33 జిల్లాలు చేసిన అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం జోన్ 5, 6 గా వున్న రాష్ట్ర ప్రాంతాన్ని ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లుగా విభజించింది. ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వారి స్థాయిని బట్టి జిల్లా, జోన్ లేదా మల్టీ జోన్ ఉద్యోగస్తులు అవుతారు. అందుకు తగినట్టుగా వారి బదిలీలు, ప్రమోషన్ లు వుంటాయి.

జీవో 317 పాత జిల్లాలు, జోన్ లలోని ఉద్యోగులు కొత్త జిల్లాలు, జోన్లు మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటికి వెళ్ళే అవకాశాన్ని కల్పించింది. దీనికి సీనియార్టీ ని ప్రధాన ప్రాతిపదిక గా పరిగణించింది. వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ లాంటి తీవ్ర అనారోగ్య కారణాలు వున్న వాళ్ళకు ఆప్షన్ లు ఎంచుకునే అవకాశం ఇచ్చింది.

ఆప్షన్ గా ఎంచుకున్న జిల్లాలో వున్న ఖాళీల మేరకు ఉద్యోగులకు అవకాశం ఇచ్చారు. సీనియార్టీ మేరకు ఉద్యోగులు తమ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. డిమాండ్ వున్న ప్రాంతంలో ఖాళీలు నిండిపోతే సీనియార్టీ తక్కువగా వున్న వారికి ఆ అవకాశం లభించలేదు. కోరుకున్న ప్రాంతం తమ స్థానిక జిల్లా అయినా సీనియార్టీ వలన పోస్టు లభించలేదు. దీనితో శాశ్వత ప్రాతిపదిక మీద వేరే జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది.

ఈ సమస్య వలన ప్రభావితం అయిన ఉద్యోగులు ఎక్కువగా మెడికల్, విద్యా, ఆరోగ్య రంగాలలో వున్నారు. ప్రభావితం అయిన ఉద్యోగస్థుల నుండి అప్లికేషన్లు స్వీకరించటానికి ఏర్పాటు చేసిన పోర్టల్ కు 52,235 అప్లికేషన్స్ రాగా అందులో రెండు సార్లు చేసిన ధరఖాస్తులను తొలగించాక 30,933 మిగిలాయని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ లో ప్రకటించారు. 371-డి ని పరిగణన లోకి తీసుకుని స్థానికతను కాదని సీనియార్టీ ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవటం వలన సమస్యలు ఎదురయ్యాయని ఆయన ఆ సందర్భంగా ప్రకటించారు.

2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో మార్పులు చేస్తేనే స్థానికత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ లో ప్రకటించటంపై స్పందిస్తూ, “ఏ చట్టం అయినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి కి లోబడి వుండాలి. 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో స్థానికత పై స్పష్టత ఇచ్చారు. లేకపోతే దానికి మార్పులు చేయాలి. ప్రభుత్వం తన వాగ్దానం నిలబెట్టుకోవాలి అనుకుంటే ఉద్యోగస్తులను జీవో 317 లో వున్న పారా 28 వున్న క్లాజ్ ను ఉపయోగించి న్యాయం చెయ్యచ్చు. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఉద్యోగస్థులను ఎక్కడి కైనా బదిలీ చెయ్యచ్చు అని అందులో వుంది. ప్రతిపక్షం లో వున్నప్పుడు ఒప్పుకున్న విషయాలనే అధికారంలోకి వచ్చాక నాయకులు కాదంటున్నారు,” అని జీవో 317 బాధిత ఉద్యోగులు టీచర్ ల సంఘం అధ్యక్షుడు టీ. విజయ్ కుమార్ చెప్పారు.

సీనియార్టీ ప్రకారం మాత్రమే ఉద్యోగ కేటాయింపులు చేయటం వలన జూనియర్ ఉద్యోగులు వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాలకు కేటాయించబడ్డారు. దీనితో తమ యువతకు మరో 20 నుండి 30 ఏళ్ల వరకు ఉద్యోగ అవకాశాలు రావని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆయా సందర్భాలలో అన్నారు. ఆదివాసీ సంఘాలు ఈ రకమైన కేటాయింపు షెడ్యూల్ 5 కు వ్యతిరేకమని గళమెత్తాయి.

“స్థానికత కోసమే తెలంగాణా ప్రాంతంలో ముల్కీ ఉద్యమం, త్రీ పాయింట్ ఫార్ములా, పెద్దమనుషుల ఒప్పందం జరిగాయి. పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి జీవో 317 ఆర్టికల్ 371-డి కి వ్యతిరేకంగా వుందని అన్నారు. శ్రీధర్ బాబు అసెంబ్లీ లో 2024 లో ఒప్పుకున్నారు. బీజేపీ కూడా అనుకూలంగా వుంది. బండి సంజయ్ నిరాహారదీక్ష చేశారు. మేము ఇటీవల బిజెపి అద్యక్షుడు రామచందర్ రావు ను కలవగా త్వరలో సిఎం కు ఉత్తరం రాస్తామని చెప్పారు. అవసరం అయితే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో మార్పులు చేసి మాకు న్యాయం చేయాలి,” అని బోయిన నాగేశ్వర రావు అన్నారు.

“ఒకటి నుండి ఏడవ తరగతి వరకు చదివిన జిల్లానే స్థానిక జిల్లా గా పరిగణించాలని 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో వుంది. కొత్త గా చేరుతున్న ఉద్యోగస్తులకు సంబంధించి దీని ఆధారంగానీ స్థానికత నిర్ధారిస్తున్నారు. దీన్నే ఉద్యోగాలలో ఉన్న మాకూ వర్తింపచేయాలని మేము అడుగుతున్నాం,” అని విజయ్ కుమార్ నొక్కి చెప్పారు.

“ఇప్పటికైనా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగస్థులను స్థానిక జిల్లాలకు పంపాలి. జోనల్ సిస్టమ్ ను గౌరవించాలి. పాత మెదక్ జిల్లాను మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలుగా చేశారు. సిద్దిపేట, మెదక్ ను రాజన్న జిల్లాలో వుంచిన బిఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి ని మాత్రం చార్మినార్ జోన్ కు మార్చింది. జిల్లా స్థాయి ఉద్యోగస్థులయిన ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులు దీనివలన స్థానికత కోల్పోయారు. దీన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్తున్న ప్రభుత్వం పరిష్కరించాలని,” యూటీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు.

Read More
Next Story