
‘బీఆర్ఎస్, బీజేపీలను మడతేసి కొడతా’
రెండు పార్టీలు కలిసి ఒకటిగా ఎన్నికల్లో పోటీచేస్తే రెండింటిని కలిపి ఒకేదెబ్బతో పడగొడతానని రేవంత్ సవాలు విసిరారు
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలను మడతేసి కొట్టి ఓడించటం ఖాయమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. ‘కుర్చీని మడతేసి కొడితే’ అనే డైలాగ్ ఆమధ్య ఎంత పాపులరైందో అందరికీ తెలిసిందే. ఒక సినిమా పాటలోని కుర్చీని మడతేసి కొడితే అనే లైను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అదే లైనును తాజాగా రేవంత్ ఉపయోగించారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ప్రత్యర్ధులే అని చెప్పారు. రెండు పార్టీలు కలిసి ఒకటిగా ఎన్నికల్లో పోటీచేస్తే రెండింటిని కలిపి ఒకేదెబ్బతో పడగొడతానని రేవంత్ సవాలు విసిరారు. రెండుపార్టీలను తాను వేర్వేరుగా చూడటంలేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోటీచేస్తాయన్నారు. అందుకనే రెండింటినీ ఒకేదెబ్బ కొట్టబోతున్నట్లు చెప్పారు. ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్న పద్దతిలో తాను ఒక్కదెబ్బతో రెండుపార్టీలను ఓడిస్తానని ధీమాను వ్యక్తంచేశారు.
రేవంత్ తాజా స్టేట్మెంట్ కు ప్రధాన కారణం ఉంది. అదేమిటంటే బీజేపీ ఆర్మూరు ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తుపెట్టుకుంటే తప్పేమిటి అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కలవటం, విడిపోవటం సహజమేకదా అని ఎదురు ప్రశ్నించారు. ‘‘నడిచేందుకు ఓ కాలు ఇబ్బందిగా ఉంట మరొకరి సాయం తీసుకుంటాము కదా’’ అని అడిగారు. ‘‘బీఆర్ఎస్ తో కలిసి పోటీచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావొచ్చు’’ అని రాకేష్ మీడియాతో చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని రేవంత్ తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. పై రెండుపార్టీల మద్య చీకటి ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపణలు అందరికీ తెలిసిందే.
మీడియాతో రాకేష్ మాట్లాడుతు ‘‘గతంలో మేం టీడీపీతో కలిపి పోటీచేశాం...ఆ తర్వాత విడిపోయాం..మళ్ళీ కలిసి పోటీచేయటమే కాకుండా కేంద్రం, ఏపీలో అధికారంలో ఉన్నాం’’ అని చెప్పారు. ‘‘రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు మరొకరి సాయం తీసుకోవటం తప్పెలాగవుతుంది’’ అని ఆశ్చర్యపోయారు. రాకేష్ తాజా ప్రకటన విన్నవాళ్ళకు బీఆర్ఎస్-బీజేపీ మధ్య పొత్తు విషయంలో తెరవెనుక ఏదో జరుగుతోంది అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాకేష్ ప్రకటనకు అదనంగా రేవంత్ తాజా ప్రకటన అనుమానాలను మరింత పెంచేస్తున్నాయి. వీటన్నింటికీ ముందు కల్వకుంట్ల కవిత ఒకసారి మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్, బీజేపీ విలీనం చర్చలు జరిగిందని పెద్ద బాంబు పేల్చిన విషయం గుర్తుందే ఉంటుంది.
అప్పుడు కవిత పేల్చిన విలీనం బాంబు, నిన్న అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ఎంఎల్ఏ రాకేష్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రెండు ప్రతిపక్షపార్టీలు కలిసిపోవటం ఖాయమని జనాలు అనుకుంటే వాళ్ళ తప్పు ఎంతమాత్రం కాదు.

