
రాయలసీమ ‘ఎత్తికోతల’ పథకం రాద్ధాంతానికి ముగింపు
వివాదం రేపి స్నేహ హస్తం చాచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగివచ్చినట్లు కనిపిస్తున్నది. స్నేహ హస్తం చాచారు. "నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదు, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది," అని స్పష్టం చేశారు.
తాను చేసింది గొప్పగా చెప్పుకోవడం తప్ప ఎవరినీ అంతగా చంద్రబాబు నాయుడు గిల్లుకోడు. తర్వాత, ఆయన భాష కూడా అంతా కఠినంగా ఉండదు. భాష విషయంలో ఆయన బలహీనమే. అదొక విధంగా వరం. తెలుగు రాజకీయాల్లో బూతులు అసలు ప్రయోగించని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఇలాంటి చంద్రబాబు నాయుడు ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో అవాక్కయ్యారు. మొన్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కొద్దిగా ప్రగల్భాలకు పోయారు. ఆగి పోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పట్టుకుని దాన్ని తానే ఆపేశానన్నారు. అక్కడి తో ఆగి ఉంటే బాగుండేది. మరొక అడుగు ముందుకేసి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తో ఏకాంతంగా మాట్లాడి, ఒప్పించి, ఆ ప్రాజక్టును స్క్రాప్ చేయించినట్లు చెప్పుకున్నారు. దీనితో అసలే చంద్రబాబు నాయుడి ని ‘రాయలసీమ ద్రోహి’గా చూసే సీమ నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు స్పందించాలి అన్నారు. ఈ ప్రాజక్టు ఆగిపోవడంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పాత్రను అంతా విస్మరించారు. ప్రాజక్టు ఎందుకు ఆగిందో అసలు నిజం తెలిసిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ చంద్రబాబు మీద రంకెవేసింది.
నిజానికి రాయలసీమలో కడతామనిచెబుతున్నవన్నీ కోతల పథకాలే. అవి ఎపుడూ పూర్తవుతాయో ఎవరికి తెలియదు. ప్రారంభించిన పథకాలను పూర్తి చేసే విషయం ఆలోచించకుండా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదించారు. అపుడు ఆయన ఆ ప్రాజక్టు గురించి ఎన్ని గొప్పలు చెప్పారో. అయినా ఎన్ జిటిలో దానిని కాపాడుకోలేకపోయారు. ఇప్పటి ముఖ్యమంత్రి కూడా రాయలసీమ కు మరిన్ని కోతల పథకాలు ప్రకటిస్తున్నారు.
రాయలసీమ ఎత్తి పోతల ప్రాజక్టు ఎందుకు ఆగిపోయిందో అందరికి తెలుసు. 2024 ఎన్నికల తర్వాత ఆ ప్రాజక్టును ఎవ్వరూ ప్రస్తావించడం లేదు. దాన్నికట్టండి, ఎందుకు మూలన పడేశారు అని ఏ రాయలసీమ నాయకుడు అడగలేదు. వైసిసి వాళ్లు కూడా డిమాండ్ చేయలేదు. ఎందుకంటే అది ఎందుకు ఆగిపోయిందో తెలియనిది ఎవ్వరికి? ఇలాంటపుడు రేవంత్ కోసిన కోత నిప్పు రాజేసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందమేదో జరిగిందనే విమర్శ మొదలయింది.
ముఖ్యమంత్రుల మధ్య ఏం చర్చలు జరిగాయో ఏమోగాని వాస్తవంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతలు పనులు నిలచిపోయాయని రాయలసీమ నీటిపారుదల విశ్లేషకుడు వి.శంకరయ్య అన్నారు.
"సాగునీటి ప్రాజెక్టుగా ప్రకటించిన పథకం తాగునీటి పథకమైంది. రాయలసీమవాసులు ఎక్కువమంది ఈ ఎత్తిపోతలు పథకం కోరుకోలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పెండింగ్ ప్రాజెక్టులకే తట్టెడు మట్టి వేసే దిక్కులేనపుడు కొత్త పథకాలు చేపట్టడమంటే తల్లికి దాహం పోయలేని వ్యక్తి పినతల్లికి పట్టుచీర కొని పెట్టిన చందంగా వుంటుంది కదా ! ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బనకచర్ల అనుసంధానం గురించి ప్రకటనలు చేసినట్లు అప్పట్లో జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలు గురించి ప్రచారం చేయించారు, " శంకరయ్య వాఖ్యానించారు.
తెలుగుదేశం మంత్రుల, నాయకులు, వైసిపి నేతల, రాయలసీమ వాదుల మధ్య వాదులాట జరిగాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాల్సి వచ్చింది.
“సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నా. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదు. భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే. "రాయలసీమ ఎత్తిపోతలపై చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదు. అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని భావిస్తున్నారు," అని పేరు పెట్టకుండా రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు.
దానికి రేవంత్ రెడ్డి నుంచి స్నేహ పూర్వక స్పందన వచ్చింది. అందులో వివాదాలు వద్దు, కోర్టు వ్యాజ్యాలు వద్దు, పరస్పర సహాకారం,చర్చలు వంటి మాటలున్నాయి.
ఆ స్పందన ఇలా ఉంది.
నదీ జలాలపై రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం భావించడం లేదని, రాజకీయాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని అని రేవంత్ రెడ్డి అన్నారు.
“పక్క రాష్ట్రాలతో తెలంగాణ వివాదాలను కోరుకోవడం లేదు. న్యాయస్థానాల ముందుకు లేదా మరెవరి వద్దనో పంచాయతీ పెట్టుకునే కన్నా సమస్యపై కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. నీటి వివాదాల విషయంలో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది. అభివృద్ధి సాధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం, సయోధ్య ఉండాలి. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలి..” అని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల వల్ల పర్యావరణం, సీడబ్ల్యూసీ నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు, అనుమతులు కూడా రావడం లేదని, తద్వారా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని అని చెప్పారు.
రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నామని, పరస్పర సహకారం అవసరమని అన్నారు. పోర్టు కనెక్టివిటీ లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగామని, ఆ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు.
అలాగే, ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని, పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పరస్పర సహకారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యల సంపూర్ణ పరిష్కారం కోసం ముందుంటామని ఆయన అన్నారు.

