‘ఆదిలాబాద్‌కు మరో యూనివర్సిటీ’
x

‘ఆదిలాబాద్‌కు మరో యూనివర్సిటీ’

ఆదిలాబాద్ సభలో జిల్లాపై సీఎం రేవంత్ వరాల జల్లు కురిపించారు. వర్సిటీతో పాటు ఎన్నో అభివృద్ధి పథకాలు జిల్లాకు వస్తాయని రేవంత్ హామీ.


ఆదిలాబాద్‌కు మరో యూనివర్సిటీ రానుందని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్న ఆదిలాబాద్‌కు ఇప్పుడు మరో యూనివర్సిటీ రావడం కీలకంగా మారింది. ఈ యూనివర్సిటీ ఆదిలాబాద్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్‌కు కీలక బూస్ట్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు సోమవారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఆదిలాబాద్‌ను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తానని పేర్కొన్నాారు. ఎర్రబస్సు కూడా రాని ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్ తీసుకొచ్చామని, అదే విధంగా ఆదిలాబాద్‌ను ప్రగతి పథంలో పరుగులు పెట్టించే బాధ్యత తనదని రేవంత్ అన్నారు.

ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సభలో ఆయన జిల్లా అభివృద్ధిపై విస్తృత హామీలు ఇచ్చారు. సభలో మాట్లాడిన ఆయన, ఇది కొమురం భీమ్ పోరాట స్ఫూర్తి నేల అని గుర్తుచేశారు. గతంలో నిరసనలు, పాదయాత్రలు అన్నీ ప్రజా సమస్యల పరిష్కారానికేనని తెలిపారు. ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చామని చెప్పారు.

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని, అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతామని పేర్కొన్నారు. అందుకే పార్టీలకు అతీతంగా సభకు ఆహ్వానం ఇచ్చామని తెలిపారు. గత పదేళ్లలో ఇలాంటి సంప్రదాయం లేదని, దీన్ని కొనసాగించాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేశామని తెలిపారు. ఓటు వేయకపోయినా అభివృద్ధి చేస్తామని, ప్రజల కష్టాలే తమకు ముఖ్యమని చెప్పారు.

సంక్షేమ పథకాలపై ఆయన వివరించారు. ఆడబిడ్డలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించి భారీగా నిధులు ఖర్చు చేశామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, ఇప్పటికే వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సన్నబియ్యం పథకం ద్వారా కోట్లాది ప్రజలకు ప్రతి నెల 6 కిలోల బియ్యం అందిస్తున్నామని చెప్పారు.

ఇది దేశంలో ప్రత్యేకమని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలపరచేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు హైటెక్ సిటీలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై కీలక హామీ ఇచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేయడం తమ బాధ్యత అని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధిపై మాట్లాడుతూ, కేంద్రంతో చర్చించి ఎయిర్‌పోర్ట్ మంజూరు చేయించామని తెలిపారు. వీలైతే జూన్ 2 నాటికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం భూసేకరణ వేగంగా జరుగుతోందని వెల్లడించారు. విద్యా రంగంలో భాగంగా యూనివర్సిటీ కోసం భూసేకరణ చేపట్టామని, త్వరలోనే శంకుస్థాపన ఉంటుందని తెలిపారు.

బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే మరింత నిధులు ఇస్తామని చెప్పారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆదిలాబాద్‌కు వచ్చి పనులను సమీక్షిస్తామని చెప్పారు. చివరిగా, ప్రజల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని, తాము పాలకులు కాదు ప్రజల సేవకులమని ముఖ్యమంత్రి తెలిపారు.

Read More
Next Story