
తెలంగాణ రాజకీయాల్లో మంటలు మండిస్తున్న ‘దావోస్ ఫొటో’
అవకతకవలకు పాల్పడి, అవినీతి కేసులో ఇరుక్కున్న గ్రీన్ కో కంపెనీతో దావోస్ లో మంత్రులు చర్చలు జరపటం ఇపుడు తెలంగాణలో బాగా వివాదాస్పదమవుతోంది
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివాదంలో ఇరుక్కుంది. దావోస్ పర్యటనలో భాగంగా గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులతో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చలు జరపటం బాగా వివాదాస్పదమవుతోంది. వివాదం ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో (KTR)కేటీఆర్ తో పాటు (Greenko)గ్రీన్ కో కంపెనీ ఏసీబీ, ఈడీ విచారణను ఎదుర్కొంటోంది. అలాగే ఈరెండు దర్యాప్తుసంస్ధలు గ్రీన్ కో కంపెనీపై కేసులు కూడా నమోదుచేశాయి. అవకతకవలకు పాల్పడి, అవినీతి కేసులో ఇరుక్కున్న గ్రీన్ కో కంపెనీతో(Davos) దావోస్ లో మంత్రులు చర్చలు జరపటం ఇపుడు తెలంగాణలో బాగా వివాదాస్పదమవుతోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే విషయమై రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలతో రెచ్చిపోతున్నాడు. అయితే ఈ విషయమై బీజేపీ నేతలు నోరిప్పటంలేదు. ఎందుకంటే ఇదే మీటింగులో బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు కాబట్టే.
అసలు విషయం ఏమిటంటే పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో నాలుగురోజులు పర్యటించిన విషయం తెలిసిందే. పెట్టుబడుల కోసం విదేశాల్లోని అనేకమంది పారిశ్రామికవేత్తలతో రేవంత్ బృందం అనేక భేటీలు జరిపింది. వీళ్ళ వల్ల తెలంగాణకు ఏమేరకు పెట్టుబడులు వస్తాయో తెలీదు. అయితే ఒక భేటీ మాత్రం తెలంగాణలో అనేక వివాదాలకు కారణమైంది. రేవంత్ సదరు భేటీలో లేకపోవటం ఒక్కటే అధికారపార్టీతో పాటు ప్రభుత్వానికి కాస్త ఊరటనిచ్చే అంశం.
కంపెనీమీద కేసు ఏమిటి ?
ఏమి జరిగిందంటే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ తో పాటు గ్రీన్ కో కంపెనీ మీద కూడా అనేక అవినీతి ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ తో పాటు గ్రీన్ కో కంపెనీ మీద కూడా ఏసీబీ, ఈడీలు కేసులు నమోదుచేశాయి. గ్రీన్ కో కంపెనీ యాజమాన్యాన్ని దర్యాప్తుసంస్ధలు ఇప్పటికే చాలాసార్లు విచారించాయి. ఫార్ములా కార్ రేసుకు గ్రీన్ కో కు ఏమిటి సంబంధం ? ఏమిటంటే కార్ రేసు నిర్వహణలో బ్రిటన్ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు హైదరాబాద్ లో గ్రీన్ కో కంపెనీయే వ్యాపార భాగస్వామి.
అగ్రిమెంట్లన్నీ అయిపోయి ఇక రేస్ మొదలుపెట్టాలని అనుకున్న సమయంలో తెరవెనుక కారణాల వల్ల గ్రీన్ కో కంపెనీ కాంట్రాక్టు నుండి పక్కకు తప్పుకున్నది. కాంట్రాక్ట్ నుండి సడెన్ గా ఎందుకు తప్పుకున్నదనే విషయాన్ని కంపెనీ యాజమాన్యం, కేటీఆరే చెప్పాలి. కాంట్రాక్ట్ నుండి తప్పుకున్న కంపెనీ అంతకుముందే బీఆర్ఎస్ కు విరాళంగా సుమారు 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చినట్లు బయటపడింది. దాంతో ఏసీబీ, ఈడీలు గ్రీన్ కో కంపెనీ మీద కూడా కేసులు నమోదు చేసి విచారిస్తున్నాయి. అంటే ప్రభుత్వం దృష్టిలో ఫార్ములా కార్ రేసు అవినీతిలో గ్రీన్ కో కంపెనీ కూడా ఉందనే. అలాంటి కంపెనీ ప్రతినిధులతో దావోస్ లో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయమై సమావేశంలో చర్చించుకున్నారు.
దావోస్ లో భేటీ ఎందుకు ?
విచిత్రం ఏమిటంటే కంపెనీ యాజమాన్యం ఉండేది హైదరాబాద్ లోనే, మంత్రులుండేదీ హైదరాబాద్ లోనే. కాని చర్చలు జరిపింది మాత్రం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో. చర్చల సారాంశం ఏమిటనే విషయం ప్రభుత్వం వెల్లడించలేదు. వీళ్ళ భేటీ ఫొటోను రిలీజ్ చేసింది కూడా ప్రభుత్వమే. ఎప్పుడైతే ఫొటో రిలీజ్ అయ్యిందో వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకున్నారు. హైదరాబాద్ లో కేసులు పెట్టిన సంస్ధ యాజమాన్యంతో రేవంత్ ప్రభుత్వం సంచుల కోసమే భేటీ అయ్యిందా ? అని నిలదీశారు. కేసులు ఎత్తేసేందుకు, మూటలు అందుకునేందుకే దావోస్ లో కంపెనీ ప్రతినిధులతో మంత్రులు చర్చలు జరిపారా ? అంటు గట్టిగా తగులుకున్నారు. ఇంకేముంది ప్రభుత్వానికి దిమ్మతిరిగింది. అందుకనే ప్రభుత్వం నుండి కేటీఆర్ ఆరోపణలకు అసలు సమాధానమే లేదు.
ఈ మొత్తంమీద గమనించాల్సిన విషయం మరోటుంది. అదేమిటంటే ఆరోపణలతో రెచ్చిపోయేందుకు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసే బీజేపీ నేతలు కూడా ఈ భేటీపై ఇప్పటివరకు నోరిప్పలేదు. ఎందుకంటే అదే భేటీలో ఏపీకి సంబంధించిన అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన కొడుకుతో పాటు పాల్గొనటమే. ఇపుడు మొదలైన వివాదం చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

