మంత్రులతో రేవంత్ ఎమర్జెన్సీ మీటింగ్
x
Revanth holds emergency meeting

మంత్రులతో రేవంత్ ఎమర్జెన్సీ మీటింగ్

మున్సిపల్ ఎన్నికల్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను తెలుసుకునేందుకు రేవంత్ ఉదయం 6.30 గంటలకే ఈ మీటింగ్ మొదలుపెట్టారు.


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం మంత్రులతో అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను తెలుసుకునేందుకు రేవంత్ ఉదయం 6.30 గంటలకే ఈ మీటింగ్ మొదలుపెట్టారు. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తోంది.

నిజానికి ఈరోజు రేవంత్ మెదక్ జిల్లాలో ప్రచారం చేయాల్సింది. అయితే అక్కడ ప్రచారం కన్నా క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు తెలుసుకుని, ఎక్కడైనా సమస్యలుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోవటం వల్ల ఎక్కువ ఉపయోగాలుంటాయని రేవంత్ అనుకున్నారు. అందుకనే అర్ధాంతరంగా మెదక్ పర్యటన రద్దుచేసుకుని మంత్రులతో జూమ్ మీటింగ్ మొదలుపెట్టారు.

రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిల్లో 2996 వార్డులు, డివిజన్లకు అన్నీ పార్టీల నుండి 12,994 మంది పోటీచేస్తున్నారు. పోటీచేస్తున్న వాటిల్లో 90శాతం గెలవాలని మంత్రులకు రేవంత్ స్పష్టంగా ఆదేశించారు. అందుకనే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు, సీనియర్ నేతలంతా తమకు కేటాయించిన మున్సిపాలిటీల్లోనే ప్రచారం చేస్తున్నారు.

ఈరోజు ప్రచారానికి ఆఖరురోజు కాబట్టే వాస్తవ పరిస్ధితులను తెలుసుకుని ఎక్కడైనా లోపాలుంటే చక్కదిద్దేందుకు రేవంత్ మంత్రులతో మాట్లాడుతున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్-బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సహకరించుకుంటున్నాయని మంత్రులు చెప్పారు. రెండు పార్టీలు కాంగ్రెస్ అభ్యర్ధులను ఓడించటమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా సహరించుకుంటున్నట్లు మంత్రులు రేవంత్ కు చెప్పినట్లు సమాచారం.

Read More
Next Story