ఆశల పల్లకిలో రేవంత్
x
Revanth Reddy

ఆశల పల్లకిలో రేవంత్

ముఖ్యమంత్రిగా ఐదేళ్ళ కాలపరిమితికి బోనస్ గా మరో ఆరునెలలు దక్కుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బాగా ఆశపడుతున్నారు


ముఖ్యమంత్రిగా ఐదేళ్ళ కాలపరిమితికి బోనస్ గా మరో ఆరునెలలు దక్కుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బాగా ఆశపడుతున్నారు. పార్టీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదున్నరేళ్ళుంటుందని, తాను ముఖ్యమంత్రిగా ఐదున్నరేళ్ళు ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాలపరిమితి ఐదేళ్ళే అన్న విషయం అందరికీ తెలిసిందే. కాని ఇపుడు రేవంత్ మాత్రం తాను ఐదున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకోవటం ఏమిటో అర్ధంకావటంలేదు. జమిలి ఎన్నికల కారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ కాలపరిమితిని ఐదేళ్ళకు అదనంగా మరో ఆరుమాసాలు పెంచబోతున్నట్లు రేవంత్ చెప్పటం విడ్డూరంగా ఉంది.

రేవంత్ ఆశిస్తున్నట్లుగా జమిలిఎన్నికలు వచ్చినా ప్రభుత్వ కాలపరిమితి ఎందుకు పెరుగుతుందో అర్ధంకావటంలేదు. అవసరమైతే ఐదేళ్ళ కాలపరిమితి తీరిన వెంటనే లేదా ముందే కూడా ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించవచ్చన్న విషయాన్ని రేవంత్ మరచిపోయాడా ? దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రప్రభుత్వ కాలపరిమితిని కూడా పెంచిన ఉదాహరణ లేదు. కాలపరిమితి పెంచకపోగా ముందుగానే ప్రభుత్వాలను రద్దుచేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఏవో కారణాలను చూపించి కొన్ని రాష్ట్రాల్లో కాలపరిమితికి ముందే ప్రభుత్వాలను రద్దుచేసి పాలనమొత్తాన్ని గవర్నర్ చేతిలో ఉంచిన ఘటనలు చాలా ఉన్నాయి.

రేవంత్ మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే కాలపరిమితి ఐదేళ్ళకు ముందే అంటే ఆరుమాసాలకు ముందే ప్రభుత్వాన్ని రద్దుచేసే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉంది. కాకపోతే షెడ్యూల్ ఎన్నికల కోసమే ఉన్న ప్రభుత్వాన్ని ఆరుమాసాలకు ముందు ఎన్నికల కమిషన్ రద్దుచేయటం చాలా అరుదు. అందుకనే అసెంబ్లీల ఎన్నికలు చాలావరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. 20 ఏళ్ళుగా రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్న రేవంత్ కు ఈ విషయాలు తెలీవని అనుకునేందుకు లేదు. కాకపోతే దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలన్న కోరిక రేవంత్ లో ఈ రూపంలో బయటపడిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


పదళ్ళు సీఎంగా ఉండాలి


గతంలో కూడా చాలా సందర్భాల్లో రేవంత్ మాట్లాడినపుడు పదేళ్ళు తానే సీఎంగా ఉంటానని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. పదేళ్ళు సీఎంగా రేవంతే ఉండాలంటే అందుకు ముందు రెండోసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి. పార్టీ గెలిచినా రేవంత్ ను కంటిన్యుచేసేందుకు అధిష్ఠానం అంగీకరించాలి. అన్నీ అంశాలు సానుకూలమైతేనే రేవంత్ రెండోసారి కూడా ఐదేళ్ళు ఉండేందుకు అవకాశాలున్నాయి. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబునాయుడు విభజన తర్వాత కేసీఆర్ చెరి తొమ్మిదిన్నరేళ్ళు సీఎంలుగా ఉన్న విషయం తెలిసిందే. బహుశా తాను కూడా వారిలాగే సుదీర్ఘకాలం సీఎంగా పనిచేయాలని రేవంత్ ఆశపడుతున్నాడేమో.

పార్టీపరంగా రేవంత్ ఎంతకాలమైనా ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలున్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ కాలపరిమితి ఐదేళ్ళు మాత్రమే. ఐదేళ్ళకు మించి ప్రభుత్వ కాలపరిమితిని పొడిగించాలంటే సాధ్యంకాదు. 2023, నవంబర్ 30వ తేదీన జరిగిన ఎన్నికలు మళ్ళీ 2028, నవంబర్ 30వ తేదీన కాని లేదా ఆలోపు కాని జరగాలి. అంతేకాని రేవంత్ ఆశపడుతున్నట్లుగా తన ప్రభుత్వ కాలపరిమితి 2028, నవంబర్ 30కి మించి ఉండే అవకాశం లేదు గాక లేదు. కాబట్టి పూర్తికాలం సీఎంగా కొనసాగినా 2028, నవంబర్ 30వరకే ఉంటారు. చంద్రబాబు, కేసీఆర్ అంతకాలం సీఎంలుగా ఉన్నారంటే టీడీపీ, బీఆర్ఎస్ నూరుశాతం ప్రైవేటు లిమిటెడ్ పార్టీలు కాబట్టే. కాంగ్రెసేమో నూరుశాతం పబ్లిక్ లిమిటెడ్. కాబట్టి ఏ కోణంలో చూసినా ఐదున్నరేళ్ళు సీఎంగా ఉండాలన్నది రేవంత్ ఆశే కాని ఆచరణ సాధ్యంకాదని అర్ధమైపోతోంది.

కాలపరిమితి పెరగదు : కూరపాటి

ఇదే విషయమై మాట్లాడుతు రేవంత్ కు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలన్న కోరిక బలంగా ఉందని కూరపాటి అన్నారు. కాకతీయ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ‘‘ ప్రభుత్వ కాలపరిమితి ఐదేళ్ళు మాత్రమే’’ అని స్పష్టంగా చెప్పారు. ‘‘ ప్రభుత్వ కాలపరిమితిని పెంచే అవకాశం ఎవరికీ లేదు’’ అని చెప్పారు. ‘‘గతంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మాత్రమే తనిష్టం వచ్చినట్లు కేంద్రప్రభుత్వ కాలపరిమితిని పొడిగించుకున్నది’’ అని గుర్తుచేశారు. ‘‘తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు పాలనతో బీఆర్ఎస్ అధికారంకు దూరమైంది’’ అన్నారు. ‘‘అలాగే బీజేపీ కూడా చెప్పుకోదగ్గ స్ధాయిలో ఎదగలేదు’’ అన్నారు. ‘‘పై రెండు ప్రతిపక్షాలను ఓడించి రెండోసారి కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే మరో ఐదేళ్ళు తానే సీఎంగా ఉండచ్చని రేవంత్ కలలు కంటున్నట్లున్నారు’’ అని కూరపాటి ఎద్దేవాచేశారు.

ప్రజలను మభ్యపెట్టడానికే : పూల

‘‘ఐదున్నరేళ్ళు సీఎంగా ఉంటానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది’’ అని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ రీసెర్చ్ ఫెలో పూల దేవేందర్ అభిప్రాయపడ్డారు. ‘‘జమిలి ఎన్నికల పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి కొంతకాలంగా రేవంత్ ప్రయత్నిస్తున్నారు’’ అని పూల ఆరోపించారు. ‘‘జమిలి ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు’’ అని పూల తెలిపారు. ‘‘ఈ ప్రక్రియ మొదలై ముగియటానికి చాలాకాలం పడుతుంది’’ అని చెప్పారు. ‘‘ప్రభుత్వ కాలపరిమితి పెంచుకోవటం రేవంత్ చేతిలోలేదు’’ అన్నారు. ‘‘ఒకవేళ జమిలి ఎన్నికలు జరిపేందుకు కేంద్రప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినా రాష్ట్రప్రభుత్వానికి అయితే కాలపరిమితి పెరగదు’’ అన్నారు. ‘‘కాలపరమితి ముగియగానే రేవంత్ ప్రభుత్వాన్ని రద్దుచేసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తారే కాని రేవంత్ ప్రభుత్వానికి పొడిగింపు మాత్రం సాధ్యంకాదు’’ అని పూల వివరించారు.

Read More
Next Story