మంత్రులపై బురద చల్లుతున్నారని రేవంత్ ఆగ్రహం
x
Revanth Reddy

మంత్రులపై బురద చల్లుతున్నారని రేవంత్ ఆగ్రహం

ఇష్టప్రకారం మంత్రులపై తప్పుడు వార్తలు రాస్తామంటే చూస్తు ఊరుకునేదిలేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు


మీడియాకు, బీఆర్ఎస్ కు మధ్య పంచాయితీలుంటే తేల్చుకోకుండా మధ్యలో మంత్రులపై ఎందుకు బురదచల్లుతున్నారు అని ముఖ్యమంత్రి (Revanth)ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఖమ్మం(Khammam) జిల్లాలో పర్యటించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన సభలో రేవంత్ మాట్లాడుతు మంత్రులపైన తప్పుడు వార్తలు రాసి బురదచల్లే ముందు ఒకసారి వివరణ తీసుకోవాలని సూచించారు. ఇష్టప్రకారం మంత్రులపై తప్పుడు వార్తలు రాస్తామంటే చూస్తు ఊరుకునేదిలేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

మంత్రులమధ్య బొగ్గుపంచాయతీలు పెరిగిపోతున్నాయనే నిరాధార వార్తలు రాసేముందు తన వివరణ తీసుకోవాల్సింది అని రేవంత్ అభిప్రాయపడ్డారు. మంత్రుల మధ్య అపోహలు సృష్టించి తన నాయకత్వానికి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు సాగవు అని అన్నారు. మంత్రుల మధ్య గొడవలున్నాయనే తప్పుడు వార్తలతో జనాల్లో అపోహలు సృష్టించి బలపడేందుకు మారీచ, సుబాహులు(కేటీఆర్, హరీష్) తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. ఎవరికి పడితే వారికి బొగ్గు గనుల తవ్వకం కాంట్రాక్టులు ఎలాగ ఇస్తామని ప్రశ్నించారు. బొగ్గు తవ్వకాల రంగంలో బాగా అనుభవం ఉన్న కంపెనీకే టెండర్లు కేటాయిస్తామని రేవంత్ క్లారిటి ఇచ్చారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరగటంలేదని, అవకతవకలకు అవకాశం కూడా లేదని స్పష్టంచేశారు.

తమ పార్టీ ఎంఎల్ఏలు, తమ సహచర మంత్రులపై తప్పుడు వార్తలు రాస్తే తనకు అగౌరవమని, బాధగా ఉంటుందని రేవంత్ అన్నారు. కాబట్టి తన ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయద్దని, రాసేముందు తన వివరణ తీసుకోవాలని చెప్పారు. వివరణ ఇవ్వటానికి మీడియాకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని కూడా రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాసినా తన నాయకత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని కూడా రేవంత్ స్పష్టంచేశారు.

అంతకుముందు ఏదులాపురం మున్సిపాలిటి పరిధిలో రు. 362 కోట్లతో చేపట్పిన అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్ధాపనల్లో రేవంత్ పాల్గొన్నారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్, నర్సింగ్ కాలేజీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. జేఎన్టీయూ కాలేజి, మున్నేరు-పాలేరు లింక్ కెనాల్, కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యుటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story